నకిలీ చికిత్సపై స్పందించిన కోర్టు | court responded fake treatment | Sakshi
Sakshi News home page

నకిలీ చికిత్సపై స్పందించిన కోర్టు

Published Mon, Jan 27 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

court responded  fake treatment

గుర్గావ్: ఒక మైనర్ బాలికకు ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తప్పుడు చికిత్స అందించి మోసం చేసిందనే ఆరోపణలపై స్టేటస్ నివేదిక అందించడంలో విఫలమయినట్టు వచ్చిన ఫిర్యాదుపై స్థానిక కోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  నోటీసులు జారీ చేశారని ఆదివారం బాధితుల తరఫు న్యాయవాది తెలిపారు. ఆస్పత్రి యజమాని మల్విందర్ మోహన్ సింగ్, ఇతర డాక్టర్లకు నోటీసులు పంపారన్నారు. గుర్గావ్‌కు చెందిన సిద్ధార్థ్ పునియా తన నాలుగేళ్ల కుమార్తె అనారోగ్యం పాలవడంతో చికిత్స కోసం ఫోర్టిస్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లకు ఆమెలో లోపం ఏమీ దొరక్కపోవడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. 
 
అక్కడ డాక్టర్లు కూడా ఆమెను పరీక్షించి..ఆమెకు ఎటువంటి అనారోగ్యమూ  లేదని చెప్పారు. అయితే మరింత మెరుగైన ఫలితాలకోసం కొన్ని పరీక్షలు చేయించాలని సూచించారు. వాటిని సదరు బాలిక కుటుంబం ఫోర్టిస్ ఎస్‌ఆర్‌ఎల్ ల్యాబ్‌లో చేయించింది. కాగా అందులో బాలిక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించింది. ‘ఆ పరీక్షల నివేదిక వల్ల బాలిక  తిరిగి మామూలు పరిస్థితికి రావడానికి ఆమెకు చాలా పరీక్షలు చేయించాల్సి వచ్చింది. దాంతో ఆమె తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనైంది. ఆమెతోపాటు కుటుంబం మొత్తం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. తప్పుడు నివేదికలిచ్చి బాలికను హింసించడమేకాక, తమ తప్పును సరిదిద్దుకునేందుకు సైతం ఆ ఆస్పత్రి యత్నించలేదు’ అని కోర్టుకు సింగ్ న్యాయవాది విన్నవించారు.
 
కేసు పూర్వాపరాలను జనవరి 25లోగా విచారించి నివేదిక అందజేయాలని సుశాంత్ లోక్ పోలీసులను కోర్టు ఆదేశించింది. శనివారం నాటి విచారణలో ‘ఫిబ్రవరి 7వ తేదీలోగా సరైన నివేదికతో సుశాంత్ లోక్ పోలీస్‌స్టేషన్ చీఫ్, దర్యాప్తు అధికారి హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది’ అని బాధితుల తరఫు న్యాయవాది సందీప్ చౌదరి తెలిపారు. కాగా ఈ విషయమై దర్యాప్తు అధికారి విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా, తమకు ఎటువంటి కోర్టు నోటీసులూ అందలేదన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement