Published
Tue, Nov 22 2016 2:47 PM
| Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
‘ఆర్బీఐ గవర్నర్.. ఓ శాడిస్టు’
- పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ నారాయణ ధర్నా
తిరుపతి: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ తిరుపతిలోని ఎస్‌బీఐ పరిపాలనా భవనం ముందు సీపీఐ ఆందోళన నిర్వహించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్యకర్తలు ధర్నా చేశారు. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీకి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ఆయన్ను ప్రజా కోర్టులో శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు. ముందు చూపులేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందించారని, దీంతో వారు జాగ్రత్తలు పడ్డారని, ప్రజలు మాత్రమే అవస్థలు పడుతున్నారని అన్నారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ శాడిస్టు అని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని అన్నారు. ధర్నా అనంతరం బ్యాంకు ఎదుట రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.