ప్రభుత్వానికే కరెంటును అమ్మాడు
సౌర విద్యుత్ గుజరాత్ రైతులకు పంటల సాగుకే కాకుండా అదనపు ఆదాయం పొందే వనరుగా మారింది. సౌర విద్యుత్ పంపు ద్వారా బోరు నీటిని పంటలకు పారిస్తున్న ఈ చిన్నకారు రైతు పేరు రమణ్ భాయ్. గోధుమ, అరటి పంటలను సాగు చేసే ఆయన పొలంలో బోరు నుంచి నీటిని తోడేందుకు సౌరశక్తితో నడిచే మోటార్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ(ఐడబ్ల్యూఎంఐ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా దక్కిన సౌర విద్యుత్ పంపు సదుపాయం వల్ల పంటకు సకాలంలో నీరంది రమణ్ భాయ్‌కి మంచి ఫలసాయం వచ్చింది. అంతేకాదు.. ఆ నాలుగు నెలల పంట కాలంలో పొలానికి నీటి అవసరం లేనప్పుడు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మాడు.
1500 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయగా, యూనిట్‌కు రూ. 5 చొప్పున రూ.7500 అదనపు ఆదాయం వచ్చింది. ఇలా ప్రభుత్వానికి సౌర విద్యుత్ అమ్మిన తొలి రైతుగా రమణ్ భాయ్ ఇటీవల వార్తల్లోకెక్కాడు. బోర్లకు సౌర విద్యుత్తు సదుపాయం కల్పిస్తే నీటి వినియోగంపై నియంత్రణ పోయి భూగర్భ నీటి వాడకం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే రైతుల నుంచి మిగులు సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చే స్తే.. నీటిని పొదుపుగా వాడేందుకు వీలవుతుందన్నది భావన. ఆ విధంగా.. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటే సౌర విద్యుత్ సదుపాయం గల రైతులు భూగర్భ జలాలను పొదుపుగా వాడతారనడానికి రమణ్ భాయ్ చక్కని ఉదాహరణగా మారాడు.