సబ్సిడీ గోవిందా!
- సోలార్ పంపుసెట్ల టెండర్ల ఖరారులో ప్రభుత్వం విఫలం
- ఒక్కో పంపుసెట్టుకు 30 శాతం కేంద్ర రాయితీ వెనక్కు... వ్యవసాయశాఖ లేఖ రాసినా పట్టించుకోని నెడ్‌క్యాప్
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ పంపుసెట్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ వెనక్కు పోనుంది. టెండర్లను ఖరారు చేయడంలో నిర్లక్ష్యం చేయడం, ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2014-15 సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి 1,500 సోలార్ పంపుసెట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. వాటి ధరలో 30 శాతం నెడ్‌క్యాప్ భరిస్తే... రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష రాయితీ ఇవ్వనుంది. ఫలితంగా రైతుకు సగం ధరకే పంపుసెట్ లభించనుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా టెండర్లను ఖరారు చేయకపోవడంతో కేంద్ర సబ్సిడీ వెనక్కు పోయినట్లేనని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
టెండర్ల ఖరారులో జాప్యం...
తెలంగాణలో దాదాపు 19 లక్షల బోరు బావులున్నాయి. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో సోలార్ విద్యుత్ పంపుసెట్లకు తీవ్ర డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు సోలార్ పంపుసెట్లను 30 శాతం సబ్సిడీతో కేటాయించింది. మన రాష్ట్రానికి 1,500 సోలార్ పంపుసెట్లను ఇచ్చింది. వాస్తవంగా ఆ సంఖ్య రాష్ట్ర రైతులకు ఏమూలకూ సరిపోదు. వాటిని రైతులకు ఇచ్చాక ఇంకా డిమాండ్ ఉందని కేంద్రాన్ని కోరితే మరికొన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కేటాయించిన వాటిని కూడా రైతులకు అందజేయడంలో సర్కారు విఫలమైంది.
గతంలో వాటికి టెండర్లను పిలిచారు. ఐదు హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంపుసెట్టు ధర రూ. 5 లక్షల వరకు కంపెనీలు కోట్ చేశాయి. అయితే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో రూ. 3.50 లక్షలకే సోలార్ పంపుసెట్టును ఏర్పాటు చేసుకుంటే ఇంత ధర కోట్ చేయడం ఏంటన్న వాదనతో ప్రభుత్వం ఆ టెండర్లను నిలిపివేసింది. ఆ తర్వాత ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ వేసింది. కానీ ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సోలార్ పంపుసెట్ల వ్యవహారం కొలిక్కిరాలేదు. టెండర్ల ఖరారుపై తాజా సమాచారం కోరుతూ వ్యవసాయశాఖ నెడ్‌క్యాప్‌కు లేఖ రాసింది. అయితే అక్కడి నుంచి ఎటువంటి జవాబు రాలేదు. దీంతో కేంద్రం కేటాయించిన 1,500 పంపుసెట్ల రాయితీ పోతుందని... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష సబ్సిడీతోనే సరిపుచ్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఉచిత సరఫరాపై అస్పష్టత...
ఇదిలావుండగా మరోవైపు ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందజేయాలని ఆలోచన చేసిన సంగతి విదితమే. దీనిపై కొన్ని కంపెనీలతోనూ చర్చలు జరిపింది. కానీ ఆ విషయం ఇంకా చర్చల దశలోనే నిలిచిపోయింది. ఒక్కో ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు ప్రభుత్వం ట్రాన్స్‌కోకు ఏడాదికి రూ. 30 వేలు చెల్లిస్తోంది. ఆ సొమ్ము తమకు ఇస్తే ఉచిత సోలార్ పంపుసెట్లు రైతులకు ఇస్తామని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. పదేళ్ల వాయిదాతో చెల్లిస్తే చాలని పేర్కొన్నాయి. ఈ విషయంపై గతంలో చర్చలు జరిగినా ముందడుగు పడలేదు. దీంతో అటు సబ్సిడీ... ఇటు ఉచిత పంపుసెట్లు ఏవీ కూడా రైతుకు రాలేదు.