- మంచిర్యాల జిల్లానే ఖర్చులో టాప్
- నూతన జిల్లా ఏర్పాటు, పండుగ నేపథ్యంలో జోరుగా అమ్మకాలు
- రూ.10 కోట్ల మద్యం,
- రూ. 5 కోట్ల బట్టలు,
- రూ. 5 కోట్ల మాంసం విక్రయాలు
మంచిర్యాల టౌన్ : నూతన మంచిర్యాల జిల్లా సంబరాలను ఓ వైపు జిల్లా ప్రజలు చేసుకుంటుంటే, సింగరేణి ఉద్యోగులు మాత్రం రెట్టింపు సంబరాలను జరుపుకున్నారు. దసరా అడ్వాన్సు కింద రూ.18 వేలు ఇవ్వడంతోపాటు, దీపావళి బోనస్‌ను రూ.54 వేలు, లాభాల్లో వాటా 23 శాతం ఇస్తున్నట్లు సింగరేణి ప్రకటించింది. దీంతో సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.
దీంతో దసరా పండుగను పెద్దఎత్తున జరుపుకున్నారు. దసరా, దీపావళి, లాభాల్లో వాటాలు ఒకే నెలలో సింగరేణి సంస్థ ఇవ్వడం.. నెల వారి వేతనాలు వీటికి అదనంగా తోడవ్వడంతో ఈ సారి బట్టలు, మాంసం, మద్యం వ్యాపారాలు జోరుగా సాగాయి.
పది రోజుల్లో రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.30 కోట్ల మద్యం సీసాలు కేవలం పది రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 57 వేల లిక్కర్ కేసులు, 64 వేల బీరు కేసులు హాజీపూర్ మండలంలోని గుడిపేట్ లిక్కర్ డిపో నుంచి అమ్ముడయ్యాయి.
ఈ నెల 7వ తేదీన రూ.2.90 కోట్లు, 8న రూ. 3.70 కోట్లు, 10న రూ.7.27 కోట్లు, మొత్తంగా రూ.13.87 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గుడిపేట్ లిక్కర్ డిపో నుంచి మంచిర్యాల, జన్నారం, తాండూరు, చెన్నూరు వరకు ఈ మద్యం అమ్మకాలు సాగుతాయి. పెద్దపల్లి జిల్లాలోని కాటారం, కాళేశ్వరం, మంథని, ధర్మారం మండలంలోని కొన్ని ప్రాంతాలకు లిక్కర్ సరఫరా అవుతుంది. మిగతాది అంతా మంచిర్యాల జిల్లాలోనే సరఫరా అవుతుంది. ఇందులో దసరాకు ముందు మూడు రోజులే రూ.10 కోట్లు జిల్లాలో మద్యం అమ్మకాలు సాగాయి.
మాంసం, బట్టల అమ్మకాల్లోనూ జోరు..
దసరా పండుగ అంటేనే విందు భోజనాలతో ఆరగించడం. దీంతో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే దసరా కోసం లక్షల కోళ్లు, వేల మేకల మాంసం అమ్ముడైంది. మంచిర్యాల మేకల మండిలోనే వేల మేకలు దసరాకు రెండు రోజుల ముందు అమ్ముడయ్యాయి. ఈ ఒక్క దసరాకు రూ.5 కోట్ల వరకు మాంసం విక్రయాలకే ఖర్చు పెట్టారు.
ఇక బట్టల విషయానికొస్తే, మంచిర్యాల ఒక్క పట్టణంలోనే దసరాకు పది రెడీమేడ్ దుకాణాలు వెలిశాయి. గతంలో ఉన్న 15 దుకాణాలకు తోడు ఈ పది కలిపి 25 దుకాణాలు ఉండగా, అందులోనే రూ.5 కోట్లకు పైగా వ్యాపారం సాగినట్లు తెలిసింది. ఇక బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, మందమర్రి పట్టణాల్లో రూ.5 కోట్లకు పైగా బట్టల వ్యాపారం జరిగింది. మొత్తంగా జిల్లాలో రూ.20 కోట్ల వ్యాపారం జరగింది.