ఔను వాళ్లిద్దరూ ఒకటయ్యారు
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా ప్రకటన వెలువడినప్పటి నుంచి పలు రకాల సంచలనాలు జరిగాయి. అందులో దీప– మాధవన్ ఒకటైన సంఘటన ఒకటి. జయలలిత అన్న కుమార్తె ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై కార్యదర్శి దీప, తన భర్త మాధవన్‌తో టీనగర్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే. జయ మృతి అనంతరం రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల కుటుంబంలో గందరగోళం నెలకొంది.
దంపతుల మధ్య నెలకొన్న కలహాల కారణంగా దీపను వదిలి మాధవన్ ఒంటరిగా హోటల్‌లో బస చేశారు. ఆర్కేనగర్ ఎన్నికల నామినేషన్ దాఖలులో దీప భర్త పేరును సూచించలేదు. తనకు మాధవన్‌తో ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన దీప మాటలను పట్టించుకోకుండా దీప పిలిస్తే ప్రచారానికి సిద్ధం అని మాధవన్ ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్కేనగర్ ఎన్నిక వాయిదాతో దీప, మాధవన్ ఒకటయ్యారు. దీనిపై ప్రశ్నించిన వారితో ఇది తమ సొంత విషయం అని దీప చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
దీపకు హత్యా బెదిరింపుల కేసు వాయిదా
ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి జె.దీపకు గత 31, 4వ తేదీల్లో టీనగర్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్ ఫోన్‌లో హత్య బెదిరింపులు చేశాడు. దీనిపై పార్టీ ప్రచార కార్యకర్త పొన్ పాండ్యన్ మాంబలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ నంబర్, ఫేస్‌బుక్‌లో అతడి ఫొటోను పోలీస్ స్టేషన్‌లో చూపించారు. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు న మోదు కాలేదు. పసుమ్‌పొన్ పాండియన్ న్యాయవాది సుబ్రమణి ద్వారా సైదాపేట 17వ న్యాయస్థానంలో మహమ్మద్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ అంకాళేశ్వరి ఈ కేసుపై విచారణను14వ తేదీకి వాయిదా వేశారు.