రోబోలతో గొంతు క్యాన్సర్, గురకకు చెక్
నూతన పద్ధతులతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారిగా రోబోలతో గొంతు క్యాన్సర్, గురకకు చికిత్స చేసే నూతన పద్ధతులకు ఢిల్లీ అపోలో ఆస్పత్రి నాంది పలికింది. ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ సర్జన్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన డా.కల్పన శుక్రవారం ఈ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
రోబోటిక్ సర్జరీ ద్వారా గురక, గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దవడ భాగం తీయకుండానే.. నోటి ద్వారా రోబో లాంటి పరికరాలను పంపించి చికిత్స నిర్వహించారు. రోగులకు అవసరమైన చికిత్సకు సంబంధించిన విధానాన్ని ముందుగా కంప్యూటర్ ద్వారా యంత్రాలకు అందిస్తారు. అనంతరం రోబోను 3డీలో వీడియో ద్వారా పర్యవేక్షిస్తూ.. చికిత్సకు అవసరమైన తదుపరి విధానాలను కంప్యూటర్ ద్వారా అందిస్తారు. ఇలాంటి చికిత్సను మొట్టమొదటి సారిగా ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో తాను నిర్వహించినట్టు డా.కల్పన తెలిపారు. వైద్యానికి సంబంధించిన అన్ని రోబో పరికరాలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. చికిత్స అనంతరం ఒక్కరోజులోనే బాధితులను డిశ్చార్జ్ చేస్తామని, చికిత్స ఖర్చులను సామాన్యులు సైతం భరించగలరని ఆమె పేర్కొన్నారు. డా.కల్పన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పుణేలో ఎంఎస్, అమెరికాలో ఫెలోషిప్, సియోల్‌లో రోబోటిక్ సర్జరీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.