కోర్టుకు రావాలంటూ ఢిల్లీ సీఎంకు ఆదేశం
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో ఈ నెల 17న కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్వీందర్ సింగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆదేశించారు. బీజేపీ ఎంపీ రమేష్ బిదురి వేసిన క్రిమినల్ పరువునష్టం కేసును శనివారం ఢిల్లీ కోర్టు విచారించింది.
ఈ రోజు కేజ‍్రీవాల్ కోర్టుకు హాజరు కావాల్సివుండగా, న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరుకాలేనని కేజ్రీవాల్ విన్నవించడంతో కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించింది. అయితే 17న జరిగే తదుపరి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించారు. కోర్టు తదుపరి విచారణలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారంటూ రమేష్ బిదురి ఆయనపై కేసు వేశారు.