న్యూఢిల్లీ: నగరంలో ఒకే ఒక ఫోరెన్సిక్ ప్రయోగశాల ఉండడంతో కేసులు త్వరగా తెమలడం లేదు. పది వేలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అంతేకాకుండా ప్రతి నెలా 500 నమూనాలు ఈ ప్రయోగశాలకు పరీక్షలకోసం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశరాజధానికి త్వరలో మరో మూడు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలతోపాటు (ఎఫ్‌ఎస్‌ఎల్) 11 మొబైల్ ఫోరెన్సిక్ లేబొరేటరీ వ్యాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ‘క్రైం కేసులను సత్వరమే పరిష్కరించడంలో నగర పోలీసులకు చేయూత ఇచ్చేందుకుగాను మరో మూడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ల ఏర్పాటుకు ప్రాథమిక అంగీకారం తెలిపాం. రోహిణి ప్రాంతంలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌పై పడుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. వీటిని జిల్లా కోర్టుల సమీపంలో ఏర్పాటు చేస్తాం. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)ని సంప్రదించాం.
ప్రతి జిల్లా కోర్టు వద్ద ఓ మొబైల్ ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఏర్పాటు చేయాలంటూ నగర పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనకు గత నెలలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది’ అని తెలిపారు. హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించామని, ఇందుకు సానుకూల స్పందన లభిస్తుందనే విశ్వాసం తమకు ఉందని ఆయన వివరించారు. ప్రయోగాల ద్వారా సేకరించిన ఆధారాలు భద్రపరిచిననాటి నుంచి ఆరు నెలలకు మించి నిల్వ ఉండవు. ఆరు నెలల కాలం ముగియగానే కడుపులోని అవయవాలు, రక్తం, డీఎన్‌ఏల నమూనాలు క్షీణించిపోవడం మొదలవుతుందని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. నగరంలో ఒకే ఒక ప్రయోగశాల ఉండడంతో దానిపై విపరీతమైన పనిభారం పడుతోందన్నారు. కాగా హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) స్థానిక ఎఫ్‌ఎస్‌ఎల్ పంపిన 110 నమూనాలను భద్రపరుస్తోంది.
ఇక కోల్‌కతాలోని ప్రయోగశాల నుంచి 50, అహ్మదాబాద్, చండీగఢ్‌లలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌లకు ఒక్కొక్కదానికి 25 కేసులను హైదరాబాద్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్ కు నగర పోలీసులు పంపుతున్నారు. కాగా ఫోరెన్సిక్ నివేదిక దాఖలు జాప్యమవడానికి కారణమేమిటో తెలియజేయాలంటూ డి సెంబర్ 16వ తేదీ నాటి సామూహిక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా హైకోర్టు... రాష్ర్ట ప్రభుత్వం, నగర పోలీసులతోపాటు రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని వివరణ కోరిన సంగతి విదితమే. దీంతో ఇందులో ఖాళీగా ఉన్న 30 ఉద్యోగాల నియామకానికి రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ శ్రీకారం చుట్టింది.
ఫోరెన్‘సిక్’కు చికిత్స
Published Sat, Nov 16 2013 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement