త్వరలో జరగనున్న ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఫలితాలు అందరినీ అశ్చర్యచకితుల్ని చేసే అవకాశం ఉందని ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఫలితాలు అందరినీ అశ్చర్యచకితుల్ని చేసే అవకాశం ఉందని ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో ఓడించవచ్చని తెలిపింది. బీజేపీ అభ్యర్థి విజేంద్రగుప్తా కంటే షీలాదీక్షిత్‌కు తక్కువ ఓట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొంది. ఈ నెల 22-24 మధ్య కాలంలో 188 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 2,101 మందిని మౌఖికంగా ప్రశ్నించి ఈ సర్వే నివేదికను రూపొందించారు.
ఒకవేళ సర్వే జరిపిన రోజే పోలింగ్ కూడా జరిగినట్లయితే కేజ్రీవాల్‌కు 42 శాతం, విజేంద్ర గుప్తాకు 21 శాతం ఓట్లు, షీలాదీక్షిత్‌కు 20 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సదరు సర్వే తెలిపింది. ఇదిలాఉంచితే షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ షీలాదీక్షిత్ ఓడిపోయే ప్రసక్తి లేదని వారు ఢంకా బజాయిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా రంగప్రవేశం చేసిన అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర సృష్టించినట్టవుతుంది. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత చురుగ్గా ఉందనే సందేశం ప్రజలతోపాటు ప్రపంచానికి అందుతుంది. ఓ మధ్యతరగతి సామాజిక కార్యకర్త.. రాజకీయ సంస్కరణల కోసం ఆరాటపడే వ్యక్తి అధికార పార్టీని గద్దె దించే స్థాయికి ఎదిగినట్టవుతుంది.