ఖీర్, బిర్యానీతో సెక్స్ వర్కర్ల హోలీ
న్యూఢిల్లీ: నగరంలోని జీబీ రోడ్డులో ఉంటున్న సెక్స్‌వర్కర్లు జరుపుకునే హోలీ మిగతావారు జరుపుకునే హోలీకి భిన్నంగా ఉంటుంది. అందరిలా వీరు వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోవడం ఇక్కడ కనిపించదు. ఏ వేడుక చేసుకున్నా వారుంటున్న భవనం పరిసరాల్లోనే జరుపుకోవాలి. హోలీ కూడా అంతే. ఈ వేడుక గురించి పదిహేను సంవత్సరాలుగా జీబీ రోడ్‌లోని రెడ్‌లైట్ ప్రాంతంలో ఉంటున్న కిరణ్ (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘మేం ఏ పండగైనా ఇక్కడే జరుపుకుంటాం. అది దీపావళి కానీయండి హోలీ కానీయండి.. అన్నీ ఈ భవనం పరిసరాల్లోనే.
హోలీ మా జీవితాల్లో మిగతా రోజులకు భిన్నంగా ఏమీ ఉండదు. కాకపోతే మా స్నేహితులంతా ఒకచోటకు చేరి రంగులు చల్లుకుంటాం. ఆ తర్వాత పసందైన ఖీర్ రుచిని ఆస్వాధిస్తాం. ఘుమఘుమలాడే బిర్యానీని లాగించేస్తాం. మరిన్ని మిఠాయిలు కూడా ఆ రోజు మా మెనూలో ఉంటాయి. మిఠాయి, గులాల్‌తో మా హోలీ వేడుక మొదలవుతుంద’ని పేర్కొంది. ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, నేషనల్ కో-ఆర్డినేటర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ... ‘నగరంలోని కొన్ని వేశ్యావాటికలు హోలీ రోజు సాయంత్రం 5 గంటలకే మూతపడతాయి. ఆకతాయిల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే అభిప్రాయంతోనే ఈ విధంగా చేస్తారు.
తమకు నమ్మకమైన కొంతమందితోనే వీరు హోలీ జరుపుకుంటారు. అదీ తాము ఉంటున్న భవనం పరిసరాల్లోనే. తమ స్నేహితులను ఆహ్వానిస్తారు. బయట పరిస్థితి ప్రశాంతంగా ఉందని భావిస్తే స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే ఈ సమయంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకతాయిలు వెంటపడడం, బలవంతంగా రంగులు చల్లడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అందుకే సాధ్యమైనంతగా హోలీని బయటకు వెళ్లకుండానే జరుపుకుంటార’న్నారు. దివ్య అనే యువతి మాట్లాడుతూ... ‘అందరిలాగే మాకు కూడా హోలీ వీధుల్లోకి వెళ్లి జరుపుకోవాలని ఉంటుంది. కానీ ఆకతాయిలు మాపట్ల ప్రవర్తించే తీరు మాకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే మావద్దకు తరచూ వచ్చే కొందరితోనే హోలీ జరుపుకుంటాం. వారే మా వద్దకు వచ్చి రంగులు చల్లి, స్వీట్లు, బహుమతులు ఇచ్చి వెళ్తుంటార’ని చెప్పింది.