న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. కాగా రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది.
అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్‌ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది.