
పార్టీకి కిరణ్‌బేడీ అవసరముంది..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ వంటి నాయకుల అవసరం పార్టీకి ఉందని, అందుకే ఆమెను పార్టీలో చేర్చుకున్నట్లు అమిత్‌షా స్పష్టం చేశారు. ఆయన శనివారం ఢిల్లీలోని హరినగర్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ చేరిక వల్ల పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఏర్పడిన అసంతృప్తిని పోగొట్టడానికి ఆయన ప్రయత్నించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ఆయన జోస్యం చెప్పారు. సగానికి పైగా సీట్లలో ఆప్ ధరావతు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఢిల్లీలోనూ మోదీ ప్రభంజనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడు నెలల్లో మోదీ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని, ఢిల్లీవాసుల కోసం అనేక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన వివరించారు. కాగా, పార్టీ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి పార్టీ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ మేరకు ప్రతి కార్యకర్త సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలను కలవాలని ఆయన ఆదేశించారు.
కిరణ్‌బేడీ సుడిగాలి ప్రచారం
కిరణ్‌బేడీ చేరికతో కమలదళం ఎన్నికల ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తున్న బేడీ.... సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. నగరంలోని మొత్తం 70 విధానసభ నియోజకవర్గాల్లో జనసభలు నిర్వహిస్తారని అంటున్నారు. రోజుకు ఐదు విధానభ నియోజకవర్గాల్లో ఆమె సభలు జరుగుతాయని తెలిసింది. రోహిణీ ప్రాంతంలో ఆదివారం జరిగే రోడ్‌షోలో ఆమె పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ మాదిరిగా తాను కూడా సామాజిక మాధ్యమాన్ని ప్రచార సాధనంగా వాడుకోనున్నట్లు బేడీ వెల్లడించారు. ఆమె ప్రతి రోజూ ట్విటర్‌లో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.