
అమెరికాలో బాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్
బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించాడు. ఇంతవరకు భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, నిజం చెప్పాలంటే ప్రవాస భారతంలోనే బాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయం ఇటీవలనే పరిశ్రమ గుర్తించిందన్నాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బొమన్...కనిపించనున్నాడు. వారు (ప్రవాస భారతీయులు) ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాని మన సినిమాలు చూసే వారిలో వారి వాటా ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అమెరికాలో భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పించేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా శుక్రవారం హోస్టన్‌లోని టొయోటా సెంటర్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా తదితరులు తళుక్కుమననున్నారు. అలాగే గత 25 ఏళ్లలో ఎన్నడూ స్టేజ్ షోలో కనిపించని డెరైక్టర్ ఫరాఖాన్ సైతం ఇక్కడ జరిగే స్టేజ్ షోలలో కనిపించనున్నారు. ఈ టీం న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగోతోపాటు కెనడాలోని వాంకోవర్‌లో సైతం తమ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది.
‘ఈ సినిమాలో పాత్రధారులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సోనూసూద్ పంజాబ్‌నుంచి వస్తే, అభిషేక్ ముం బైలో ఉంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం పూర్తిగా వైవిధ్యం.. అలాగే నేను పార్సీ కుటుంబానికి చెందినవాడిని.. ఇలా అన్ని రకాల సంస్కృతులు ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాకు నమ్మకముంది. ఇది ప్రేక్షకులను రంజింపజేస్తుందనే నమ్ముతున్నా..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, బొమ్మన్ ఇంతకుముందు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, ఖోస్లా కా ఘోస్లా, డాన్-ది ఛేజ్ బిగిన్స్ ఎగైన్ వంటి హిట్ సినిమాల్లో నటి ంచిన విషయం తెలిసిందే.