
అరెస్ట్‌తో హర్షం
► నిన్న నేత...నేడు ముద్దాయి
► అన్నీ అర్ధరాత్రి ప్రకంపనలే
► కస్టడీకి అప్పగింతతో ఉత్కంఠ
► చెన్నైకు తీసుకొచ్చే అవకాశం
► దినకరన్‌కు మద్దతు శూన్యం
సాక్షి, చెన్నై: అదృష్టం కలిసి రావడంతో ఇక, అన్నాడీఎంకేకు సర్వం తానే అన్నట్టు రెండున్నర నెలలు ఓ నాయకుడిగా చక్రం తిప్పిన టీటీవీ దినకరన్ రాతను మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు మార్చేశారు. నిన్న మొన్నటి వరకు నేతగా ఉన్న దినకరన్ తాజా గా ముద్దాయి అయ్యారు. తమకు అడ్డంగా దొరికిన దినకరన్‌ను బుధవారం కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్నారు. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తదుపరి అరెస్టు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అన్నాడీఎంకేలోని నాయకుల్లో దినకరన్ కూడా ఒకరే.
ఎంపీగా, పార్టీలో చిన్న పాటి పదవిలో ఉన్నా, జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశకళ కావడంతో చాప కింద నీరులా తన పనితనాన్ని ప్రదర్శించాడు. శశికళ అక్క వనితామణి కుమారుడైన టీటీవీ దినకరన్‌తో పాటు, ఆ కుటుంబం సాగిస్తున్న బండారాలు వెలుగులోకి రావడంతో అమ్మ జయలలితతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందర్నీ మూకుమ్మడిగా బహిష్కరించారు. తదుపరి ఆరేళ్లు శశికళ కుటుంబీకులు ఏ ఒక్కరి పేర్లు తెర మీదకు రాలేదు.
అమ్మ మరణంతో హఠాత్తుగా మళ్లీ తెరమీదకు ఆ కుటుంబం రావడం వివాదానికి దారి తీసింది. అయినా, వాటన్నింటినీ తన కనుసనల్లో అణగదొక్కేందుకు చిన్నమ్మ ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. ఈ సమయంలో చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో దినకరన్‌ను అదృష్టం కలిసి వచ్చింది. ఇక, పార్టీకి సర్వం తానే అన్నంత భావనతో చక్రం తిప్పే యత్నం చేశారు. రెండున్నర నెలలు ఆయన సాగించిన రాజకీయం చివరకు క్రిమినల్ అన్న ముద్ర పడేలా చేసింది. రెండాకుల చిహ్నం కోసం వేసిన ఎర, తన మెడకు చుట్టుకోవడంతో మంగళవారం రాత్రి దినకరన్ రాతను ఢిల్లీ పోలీసులు మార్చేశారు.
అర్ధరాత్రి అరెస్టు : తమిళనాడులో ఇటీవల కాలంగా అన్ని పరిణామాలు అర్ధరాత్రి వేళ సాగుతున్నాయి. అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరడం మొదలు మరణ సమాచారం బయటకు రావడం కూడా అర్ధరాత్రే చోటు చేసుకుంది. చిన్నమ్మ శిబిరానికి వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం తిరుగుబాటు అర్ధరాత్రే సాగగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు అదే బాటలో సాగింది. నాలుగు రోజుల్లో 37 గంటల పాటు సాగిన విచారణలో 50 ప్రశ్నల్ని దినకరన్‌కు ఢిల్లీ పోలీసులు సంధించారు. రెండాకుల కోసం హవాల ఏజెంట్ల ద్వారా నగదు మార్పిడి సాగించడం, ఇందుకు స్నేహితుడు మల్లికార్జున్ సహకారం తోడు కావడం వెరసి ప్రస్తుతం క్రిమినల్ అన్న ముద్రను వేసుకోక తప్పలేదు. దినకరన్ అరెస్టుతో తమిళనాట ఉత్కంఠ రేగ వచ్చని సర్వత్రా భావించారు.
అయితే, పట్టించుకున్న వారుంటే ఒట్టు. ఒకరిద్దరు హడావుడి సృష్టించినా, తదుపరి హర్షం వ్యక్తం చేసిన వాళ్లే అధికం. ఇక, పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ మాత్రం షాక్‌కు గురి కావడం గమనార్హం. అలాగే, దినకరన్ మద్దతుదారుడు అన్నాడీఎంకే నాయకుడు నాంజిల్ సంపత్ మాత్రమే ఇదో కుట్ర అని, అన్యాయంగా ఇరికించారని ధ్వజమెత్తారు. ఇక, ఐదు రోజుల కస్టడీకి దినకరన్‌ను అప్పగించిన దృష్ట్యా, ఆయన్ను విచారణ నిమిత్తం చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే, పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం 1.3 కావడంతో మిగిలిన మొత్తం ఏమైనట్టో అని పెదవి విప్పే వారు పెరిగారు. ఇక, ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుకు మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అన్న చర్చ హోరెత్తుతోంది.
సమగ్ర విచారణకు డిమాండ్ : దినకరన్ అరెస్టును తమిళనాట అన్ని పార్టీలు ఆహ్వానించాయి. అయితే, ఈ విచారణను ఇంతటితో వదలి పెట్టకుండా, వెనుక మరెవ్వరైనా ఉన్నారా..? అన్న కోణంలో దర్యాప్తు వేగం పెంచాలని రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నాడు. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, వీసీకే నేత తిరుమావళవన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఇదే డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు.
ఓ పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవు అని, ఆ పార్టీకి చెందిన వారికి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం అయితే, దినకరన్‌తో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం పన్నీరు శిబిరానికి చెందిన నేత పొన్నయ్యన్ పేర్కొంటూ ఆహ్వానిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. అవినీతికి చరమ గీతం పాడే విధంగా ఈ అరెస్టు సాగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ అయితే, ఏ ఒక్క అవినీతి పరుడ్ని వదలి పెట్టే ప్రసక్తే లేదని, అందరూ శిక్షించబడతారని, ఇందుకు దినకరన్ అరెస్టు స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు.