ఇక రాత్రుల్లోనే ప్రచారం కెప్టెన్ కొత్తబాట
సాక్షి, చెన్నై: ఎండ దెబ్బకు తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి, డీఎండీకే అధినేత విజయకాంత్ ఉన్నట్టుంది. ఇక, సాయంత్రం, రాత్రుల్లోనే ప్రచారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించే పనిలో పడ్డారు. విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదీ ముందుగా తలచుకోరు, సమయానికి తగ్గట్టుగా మాత్రమే వ్యవహరిస్తారు.
ప్రసంగాల్లో కూడా తనకు తోచిందే మాట్లాడుతుంటారు. అలాంటి విజయకాంత్‌కు తరచూ కోపం రావడం సహజం. బుధవారం మీడియాను టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించిన విజయకాంత్, ఇక జాగ్రత్తల్లో పడ్డారు. ఇదంతా ఎండ దెబ్బే అని చాటుకునే విధంగా, దానికి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ప్రచారానికి దూరం అని ప్రకటించేసుకున్నారట!. అబ్బో విజయకాంత్ ఏమైనా తెలివైన వాడే.
ఎండ దెబ్బకు తానే కాదు, తన కార్యకర్త కూడా సొమ్మసిల్లి పోకూడదనే, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రచార, బహిరంగ సభలకు చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలకు సూచించే పనిలో పడ్డారు. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉందని, ఇతరుల సభల్లో కార్యకర్తలు భానుడి దెబ్బకు మృత్యువాత పడుతున్నారని పరోక్షంగా అమ్మ జయలలిత సభల్లో చోటుచేసుకున్న ఘటనల్ని ఎత్తి చూపుతూ కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు గురువారం సందేశాన్ని పంపించారు.