అమ్మ బొమ్మ కేసులో కెప్టెన్ కు బెయిల్
-అమ్మ బొమ్మ కేసులో కోర్టుకు
సాక్షి, చెన్నై:బస్టాప్‌లో ఉన్న అమ్మ బొమ్మను తొలగిస్తూ ఆదేశించిన కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్‌కు బెయిల్ లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం తంజావూరు కోర్టు మెట్లు గురువారం విజయకాంత్ ఎక్కాల్సివచ్చింది. వర్షాలు, వరదలతో డెల్టా అన్నదాత తీవ్ర కష్టాల్లో మునిగి ఉన్న విషయం తెలిసిందే. వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కంటి తుడుపు చర్యగా ఉండటంతో పోరు బాటకు డిసెంబర్‌లో విజయకాంత్ పిలుపు నిచ్చారు. డిఎండికే నేతృత్వంలో రైతు మద్దతు దీక్షకు తంజావూరులో జరిగింది.
విజయకాంత్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి బస్టాప్‌లో సీఎం జయలలిత బొమ్మ ఉండటంతో ఆగ్రహంతో ఊగి పోయారు. ఆ బొమ్మను తొలగించే విధంగా పార్టీ వర్గాలకు ఆదేశించారు. అత్యుత్సాహంతో డిఎండికే వర్గాలు ఆ బొమ్మను చించి పడేయడంతో తంజావూరులో రణ రంగానికి దారి తీసింది. ఈ వ్యవహారంతో అన్నాడిఎంకే వర్గాలు తమ ప్రతాపాన్ని డిఎండికే మీదచూపించారు.
పోలీసులు రంగంలోకి దిగడంతో వ్యవహారం కేసులకు దారి తీసింది. సీఎం జయలలిత బొమ్మను ధ్వంసం చేయాలని ఆదేశించడం, నోటి దురుసుతో తంజావూరులో వివాదం సృష్టించడం తదితర సెక్షన్ల మోత డిఎండికే వర్గాల మీద మోగాయి. ఈకేసులో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అరెస్టు అయ్యారు. ఎన్నికల సమయంలో విజయకాంత్‌ను సైతం అరెస్టుచేయోచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. దీంతో ముందస్తు బెయిల్ కోసం మదురై ధర్మాసంను ఆయన ఆశ్రయించారు. అయితే, తంజావూరు కోర్టు విచారణకు హాజరై, అక్కడే బెయిల్ తీసుకోవాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది.
కెప్టెన్‌కు బెయిల్: మదురై ధర్మాసనం సూచనతో గురువారం విజయకాంత్ తంజావూరుకు చేరుకున్నారు. కోర్టుకు తమ నేత హాజరు అవుతుండడంతో పెద్ద ఎత్తున డీఎండీకే వర్గాలు అక్కడికి తరలివచ్చాయి. విజయకాంత్‌ను కోర్టుకు వెళ్లే మార్గంలో పోలీసులు అరెస్టు చేయొచ్చన్న ప్రచారం బయలు దేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, పోలీసులు అలాంటి సాహసం చేయలేదు.
కోర్టు విచారణకు హాజరైన విజయకాంత్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదన విన్పించారు. అయితే, వారి వాదనతో ఏకీభవించని తంజావూరు కోర్టు విజయకాంత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు నుంచి ఉత్సాహంగా విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. విజయకాంత్ కోర్టు విచారణకు వెళ్లడంతో చెన్నైలో ఆశావహుల ఇంటర్వ్యూల బాధ్యతల్ని పార్టీ నాయకులు ఇలంగోవన్, పార్థసారధి, చంద్రకుమార్ తమ భుజాన వేసుకున్నారు.