చెన్నై: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో బెయిల్ మంజూరు అయిన అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శనివారం చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. దినకరన్ విడుదల సందర్భంగా అడయార్‌లోని ఆయన నివాసం వద్ద శనివారం టపాసులు, డప్పుల మోతతో హోరెత్తించారు. అంతేకాకుండా పూలు, పళ్లు, పూలదండలతో అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఈ కేసులో దినకరన్‌తో పాటు ఆయన మద్దతుదారులకు ఢిల్లీ కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా దినకరన్ అనుచరుడు మల్లిఖార్జున్ కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం ‘రెండాకుల’ కోసం ఈసీకి లంచం ఇవ్వచూపినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.