డీఎంకే అధినేత ఎం కరుణానిధి నేతృత్వంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసి వ్ అలయన్స్(జననాయగ ముర్పోక్కు కూట్టని) బుధవారం ఆవిర్భవించింది. ఈ కూటమిలో ని పార్టీల సీట్ల పందేరాలు కొలిక్కి వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటనకు డీఎంకే సిద్ధమవుతోంది.
సాక్షి, చెన్నై : యూపీఏతో కటీఫ్ తర్వాత కాంగ్రెస్‌పై డీఎంకే అధినేత ఎం కరుణానిధి విరచుకుపడుతూ వచ్చారు. ఇక ఆ పార్టీతో కూటమి లేదని తేల్చారు. అయితే, కాంగ్రెస్ పెద్దలు గోపాలపురం మెట్లు ఎక్కుతూ ఉండడంతో వీరి బంధం మళ్లీ బలపడే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, కరుణానిధి మాత్రం మెట్టు దిగలేదు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను తమతో కలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం తో ఒంటరిగా తన సత్తాను చాటుకునే పనిలో పడ్డారు. డీఎంకేతో కలసి పనిచేయడానికి తాము రెడీ అని వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, పుదియ తమిళగం, మనిద నేయమక్కల్ కట్చిలు ప్రకటించాయి. పలు సామాజిక వర్గాలతో నిండిన ఈ పార్టీలతో కలసి ఎన్నికలు ఎదుర్కొనేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది.
డీపీఏ ఆవిర్భావం: వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, పుదియ తమిళగంలు ఎన్నికల్లో పోటీకి నిర్ణయించడంతో వారికి సీట్ల కేటాయింపులు జరిగాయి. వీసీకేకు రెండు, మిగిలిన పార్టీలకు తలా ఓ సీటు కేటారుుంచారు. అలాగే, ఈ పార్టీలతో పాటుగా డీఎంకేతో కలసి పనిచేయడానికి ద్రవిడ కళగం, ఎంజీయార్ కళగం, పెరుంతలైవర్ మక్కల్ కచ్చి, ఇండియ దేశీయ లీగ్, ఇండియ ఫార్వడ్ బ్లాక్, ఉలవర్ ఉలై పాలర్ తదితర 16 చిన్న పార్టీలు ముందుకు వచ్చాయి. దీంతో ఈ పార్టీల నేతలందరితో బుధవారం అన్నా అరివాళయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి భేటీ అయ్యారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సంయుక్త కార్యదర్శి దురై మురుగన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, ఎంజియార్ కళగం నేత ఆర్‌ఎం వీరప్పన్, ఇండియ యూనియన్ ముస్లీం లీగ్ నేత ఖాదర్ మోహిద్దీన్, వీసీకే నేత తిరుమావళవన్, పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, ఎంఎంకే నేత జవహరుల్లా, పెరుంతలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్‌ఆర్ ధనపాలన్,
ఇండియ దేశీయ లీగ్ నేత తిరుప్పూర్ అల్తాఫ్, ఇండియ ఫార్వర్డ్ బ్లాక్ నేత సంతానం ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనే రీతిలో కార్యాచరణ సిద్ధంచేశారు. తమ కూటమికి డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్(డీపీఏ)గా నామకరణం చేశారు. తమకూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం తథ్యమని, కేంద్రంలో చక్రం తిప్పబోయేది తామేనన్న ధీమాను డీఎంకే మిత్రులు వ్యక్తం చేయడం విశేషం. ఈలం తమిళుల సంక్షేమ నినాద అస్త్రంతో ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఈ కూటమి నిర్ణయించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కూటమిలోకి కొత్తగా వచ్చే వాళ్లను ఇక చేర్చుకోబోమంటూ డీఎంకే అధిష్టానం ప్రకటించింది. మిత్రులందరూ సంతృప్తికరంగా ఉండడంతో ఇక తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు డీఎంకే సన్నద్ధం అవుతోంది.
డీపీఏ ఆవిర్భావం!
Published Thu, Mar 6 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement