ఇరకాటంలో జల్లికట్టు వ్యవహారం
అనుమతి ఇస్తే కోర్టు ధిక్కారమే
అటార్నీ జనరల్ హెచ్చరికతో మల్లగుల్లాలు
సర్వత్రా మద్దతుకు పీఆర్ విజ్ఞప్తితో సందిగ్ధం
తిరువణ్ణామలైలో నిషేధం ఉల్లంఘన
జల్లికట్టుకు అనుమతి వ్యవహారం రాష్ట్రంలోని కమలనాథుల్ని కలవరంలో పడేస్తోంది. అనుమతి దక్కని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని చవిచూసినట్టే అన్న ఆందోళన వారిలో బయలు దేరింది. అడ్డంకులను అధిగమించి ఒక వేళ అనుమతి ఇస్తే, కోర్టు ధిక్కారం తప్పదన్న హెచ్చరికను అటార్నీ జనరల్ స్పష్టం చేసి ఉండడంతో అనుమతిపై ఉత్కంఠ పెరిగింది. ఈ సమయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా మద్దతు ఇవ్వాలని పొన్ రాధాకృష్ణన్ విజ్ఞప్తి చేయడం సందిగ్ధతకు దారి తీసింది.
సాక్షి, చెన్నై:
తమిళుల వీరత్వాన్ని చాటే సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు విధించిన నిషేధం ఎత్తి వేయాలన్న నినాదంతో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. ప్రత్యేక చట్టంతో అనుమతి ఇవ్వాలని కేంద్రంపై సీఎం జయలలిత ఒత్తిడి పెంచారు. దీంతో జల్లికట్టు అనుమతి వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి శిరోభారంగా మారిందని చెప్పవచ్చు. తొలుత జల్లికట్టుకు అనుమతి తప్పకుండా వస్తుందని, సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టు తథ్యం అంటూ రాష్ట్రంలో జబ్బలు చరిచిన కమలనాథులకు తాజా పరిస్థితులు కలవరాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడ తమకు డిపాజిట్లను అసెంబ్లీ ఎన్నికల్లో గల్లంతు చేస్తాయోనన్న ఆందోళన నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించాలన్న కాంక్షతో కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. తమతో కలసి రావాలంటూ పలు పార్టీలకు పిలుపు నివ్వడంతో పాటుగా మంతనాల్లో బిజీబిజీగానే ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకుంటూ తమ ద్వారానే రాష్ట్రానికి గానీ, తమిళులకు గానీ అన్ని విధాలుగా న్యాయం జరుగుతాయన్న హామీలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో జల్లికట్టుకు అనుమతి దక్కేనా..? దక్కదా..? అన్న ఉత్కంఠ కమలం వర్గాల్లో బయలు దేరి ఉండడం గమనార్హం. ఇందుకు కారణం జల్లికట్టు నిర్వహణ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు అటార్నీ జనరల్‌తో జరిపిన సంప్రదింపుల్లో ఎదురైన పరిణామాలే.
జంతు సంరక్షణ సంస్థ అనుమతి నిరాకరించి ఉండడం, సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో స్పష్టమైన తీర్పును ఇచ్చి ఉన్న దృష్ట్యా, దాన్ని అధిగమించి ఏదేని ఉత్తర్వులు, అనుమతి ఇచ్చినా అది కోర్టు ధిక్కారం కింద వస్తుందన్న విషయాన్ని కేంద్రానికి అటార్నీ జనరల్ స్పష్టం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో జల్లికట్టుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కోర్టు ధిక్కారానికి గురి కావాడమా..? లేదా, ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టడమా..? అన్న అంశంపై అటవీ , పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నేతృత్వంలోని అధికార వర్గాలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నట్టుగా తెలిసింది. ఒక వేళ అనుమతి ఇవ్వని పక్షంలో తమిళనాట పార్టీకి తీవ్ర దెబ్బ తగులుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఢిల్లీలోని కమలం పెద్దలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉన్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో జల్లికట్టు తమను కలవరంలో పడేస్తుండడంతో, ఇన్నాళ్లుగా ప్రజలకు ఇస్తూ వచ్చిన హామీ, భరోసాకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా శనివారం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించడం చర్చకు దారి తీసింది. జల్లికట్టు వ్యవహారంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కేంద్రం చేపట్టే చర్యలకు సర్వత్రా మద్దతు ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుమానాల్ని పెంచుతున్నాయి.
జల్లికట్టు నిర్వాహకులు, క్రీడకారులు తీవ్ర అయోమయంలో పడక తప్పడం లేదు. జల్లికట్టుకు అనుమతి రావాలనే తాము కోరుకంటున్నామని, వస్తుందన్న నమ్మం ఉందని, అయితే, కేంద్రం చివరి క్షణంలో తీసుకునే ఏదేని నిర్ణయానికి కట్టుబడే విధంగా మద్దతు ఇవ్వాలంటూ మంత్రి వ్యాఖ్యలు చేసి ఉన్నారేగానీ, ఇందులో అనుమానించాల్సి విషయం లేదని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా కొత్త సంవత్సరం వేళ ఎద్దులను వదిలి పట్టుకునే వేడుకను తిరువణ్ణామలై సమీపంలోని కలశపాక్కంలో జరిపి ఉండడం గమనార్హం.
కమలంలో కలవరం
Published Sun, Jan 3 2016 3:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement