దుర్భిక్షం...
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర కరువు ఛాయలు కమ్ముకున్నాయి. దీంతో జలకళతో కళకళలాడాల్సిన చెరువులన్నీ బీళ్లుగా మారిపోయాయి. దీంతో రాష్ట్రమంతటా సాగునీటితో పాటు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కర్ణాటక వాతావరణ విపత్తు నిర్వహణా కేంద్రం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,073 చెరువులున్నాయి. వాటిలో నీటితో నిండినవి కేవలం 13 కాగా, మిగిలిన 2,060 చెరువులు నీళ్లు లేక బీటలు వారి కనిపిస్తున్నాయి. ఉత్తర కర్ణాటకలోని మూడు చెరువులు, దక్షిణ కర్ణాటకలోని పది చెరువులు మాత్రమే జలకళను సంతరించుకోగా, మిగిలిన చెరువులన్నీ ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని కర్ణాటక వాతావరణ విపత్తు నిర్వహణా కేంద్రం లెక్కలే చెబుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తం గా ముంగారు వర్షాలు దోబూచులాడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని చెరువులతో పాటు జలాశయాలు కూడా ఖాళీఖాళీగానే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ జలాశయాల్లో హారంగి, కబిని జలాశయాలు మినహా మరేజలాశయం కూడా పూర్తి స్థాయిలో నీటితో భర్తీ కాలేదు. ఈ ఏడాది భద్రా జలశయంలో 20టీఎంసీల నీటి కొరత నమోదు కాగా, వారాహి జలాశయంలో 12టీఎంసీలు, తుంగభద్రాలో 24టీఎంసీలు, కేఆర్‌ఎస్‌లో 19టీఎంసీలు, లింగనమక్కిలో 84టీఎంసీలు, ఆలమట్టిలో 51టీఎంసీలు, మలప్రభాలో 25టీఎంసీల నీటి కొరత నమోదైంది. కాగా, గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో వర్షపాతం కాస్తంత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రముఖ జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో నిండాయి.
కేవలం చిన్నపాటి చెరువుల్లో మాత్రమే నీటి కొరత ఎదురైంది. దీంతో సాగు, తాగునీటికి పెద్దగా ఇబ్బందులు ఏర్పడలేదు. కాగా, రాష్ట్రంలోని కొన్ని జలాశయాల నుంచి పక్క రాష్ట్రాలకు కూడా నీటిని ఇవ్వాల్సి ఉంది, అంతేకాక ఇక ఈ వర్షకాల సీజన్ చివరి నాటికైనా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తాయనే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని పంటపొలాలకు ఇచ్చే సాగునీటిలో కోత విధించి ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తోంది కూడా! ఈ కారణంగా ఇప్పటికే పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలు మరింతగా సమస్యల్లో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.