న్యూఢిల్లీ: రకరకాల సాకులతో ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) ఒక్కో బస్సును పక్కకుపెడుతోంది. ఇలా రెండున్నరేళ్లలో ఏకంగా 900 బస్సులను పక్కకుపెట్టింది. పక్కకు పెడుతున్నవన్నీ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులేనని, నిర్వహణ వ్యయం ఎక్కువవుతున్నందున వాటిని వదిలించుకోక తప్పడంలేదని డీటీసీ అధికారులు అంటున్నారు. నిజమే వాటి నిర్వహణ వ్యయం ఎక్కువైనందున పక్కకు పెట్టారు. మరి వాటి స్థానంలో ఎన్ని కొత్త బస్సులను రోడ్లపైకి తెచ్చారు? అని అడిగిన ప్రశ్నకు డీటీసీ అధికారుల వద్ద సమాధానమే కరువైంది. రెండున్నరేళ్లలో కనీసం ఒక్క కొత్త బస్సు కూడా రోడ్లపైకి కాలేదు. 2012 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం జూన్ 30 వరకు 892 బస్సులను డీటీస పక్కకుపెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇవన్నీ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులే. నిర్వహణ భారం భరించలేకే వీటిని పక్కకు పెట్టామని చెబుతున్నారు. 2012-13లో 446 బస్సులను పక్కకు పెట్టారు. 2003 తర్వాత ఇంత భారీ సంఖ్యలో బస్సులను పక్కనబెట్టడం ఇదే తొలిసారి. ఇక 2013-14లో 222 బస్సులను పక్కనబెట్టారు. దీంతో ఏసీ, నాన్ ఏసీ బస్సుల సంఖ్య 5,223 ఉండగా అందులో 900 బస్సుల కోత పడింది. ఈ ఏడాది మే నెలలోనే 176 బస్సులను పక్కనబెట్టారు. జూన్‌లో మరో 48 బస్సులను డిపోలకే పరిమితం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ... రాజధానిలోని రహదారులపై తిరుగుతున్న 1,216 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల్లో చాలావరకు 8 సంవత్సరాలకు పైడినవేనని, దీంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, అందుకే వాటిని పక్కకు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో దశలవారీగా బస్సులను తొలగించాలని నిర్ణయించామంటున్నారు.
ప్రయాణికుల ఇక్కట్లు...
బస్సులను తొలగిస్తూ వస్తున్న డీటీసీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టే విషయమై మాత్రం ఆలోచించడంలేదు. దీంతో బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక్కసారిగా 900 బస్సులు తగ్గినప్పుడు వాటిలో ప్రయాణించేవారంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకవేళ డీటీసీ బస్సులో ప్రయాణించినా కిక్కిరిసిన రద్దీని భరిస్తూ ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా కొత్త బస్సులను రోడ్లపైకి తేవాలని ప్రయాణికులు కోరుతున్న మాటలు డీటీసీ అధికారుల చెవికి ఎక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డీటీసీలో ‘తీసివేత’లు..!
Published Tue, Sep 30 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement