ఢిల్లీలోని అధికార యంత్రాగాన్ని కాషాయీకరణ చేయడానికి బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. డీపీసీసీఅధ్యక్షుడు అర్విందర్ సింగ్ నేతత్వంలో శుక్రవారం ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృంధంలో నగరంలో అధికార యంత్రాంగాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈసీకి ఈమేరకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందే కాంగ్రెస్ నేతలు ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.
హరూన్ యూసఫ్, ముఖేష్ శర్మ, కేసీ మిట్టల్ తదితర నేతలతో ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం లవ్లీ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో మూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. శాసనసభఎన్నికలు కూడా త్వరలో జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వ అదికారులను బెదిరిస్తున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండడంతో వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కాషాయమయంగా మారుస్తున్నారు’ అని లవ్లీ ఆరోపించారు. బీజేపీ నేతలు కొద్ది రోజుల కిందట హోం శాఖ మంత్రి రాజ్‌నాథ సింగ్‌ను కలిశారని, ఆ తరువాత ప్రధాన కార్యదర్శిని బదిలీ చేశారని లవ్లీ ఆరోపించారు.
అదేవిధంగా బీజేపీ ప్రతినిధి బృందం పోలీస్ కమిషనర్ బస్సీని కలిసి పలువురు ఎస్‌హెచ్‌ఓలపై ఫిర్యాదు చేశారని. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారని లవ్లీ ఆరోపించారు. తమ పార్టీ మాట వినకపోతే బదిలీ చేయిస్తామంటూ బీజేపీ నాయకులు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారన్నారు, ఎన్నికల్లో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారని ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు లవ్లీ చెప్పారు. అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఓ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యంలో ఇదే మొదటిసారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన చెప్పారు.
బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Published Sat, Aug 30 2014 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement