ప్రచార హోరు..! | election campaign war starts in maharastra | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు..!

Published Sat, Oct 4 2014 10:25 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రచార హోరు..! - Sakshi

ప్రచార హోరు..!

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారి మాకు అధికారం ఇవ్వడంటూ అన్ని పార్టీలూ శనివారం రాష్ర్టవ్యాప్తంగా ప్రచార సభలను పోటాపోటీగా నిర్వహించాయి. ఒంటరి పోరుతో పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈసారి ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా నిలబడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు ప్రముఖ పార్టీల ప్రచారసభలతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు మార్మోగాయి. ఈసారి అన్ని పార్టీలూ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

శనివారం నరేంద్ర మోడీ తోపాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇలా దాదాపు అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పీఎం నరేంద్రమోదీ బీజేపీ తరఫున శనివారం రాష్ర్టంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరాఠ్వాడాలోని బీడ్ లో మధ్యాహ్నం, ఔరంగాబాద్‌లో సాయంత్రం, ముంబైలో రాత్రి జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీని పూర్తిమెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, ఎన్సీపీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించినమోదీ తమ మాజీ మిత్రుడైన శివసేనపై మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం విశేషం.
 
ఇదిలా ఉండగా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా సాతారా, పాటణ్‌లలో జరిగిన రెండు బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులను విమర్శిస్తూ ఎన్సీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ఎన్సీపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు.  కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్  శనివారం బుల్దానాలోని బరకట్ బకాల్‌లో, అకోలాలోని ఆకోట్‌లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసమితి అధ్యక్షులైన నారాయణ రాణే పుణేలోని బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. ఇక శివేసన అధ్యక్షుల విషయానికి వస్తే అకోలాలో మధ్యాహ్నం, బుల్దానా, అమరావతిలలో సాయంత్రం నిర్వహించిన బహిరంగసభల్లో పాల్గొన్నారు.
 
ఈ సభల్లో కాంగ్రెస్, ఎన్సీపీలపై ధ్వజమెత్తిన ఆయన బీజేపీపై కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో నాయకులు లేకనే నరేంద్ర మోడీని ఎన్నికల ప్రచారంలో దింపారని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు శివసేనను బీజేపీ వాడుకుందని ఆరోపించారు.
 
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా నాందేడ్, లోహలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయన కూడా తనదైన శైలిలో ప్రముఖ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఒక్కసారి మా చేతికి అధికారం ఇచ్చిచూడండని రాష్ట్ర ప్రజలను కోరారు.  మరోవైపు సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా రత్నగిరి, కనకవిలీలో జరిగిన బహిరంగ సభలలో ప్రసగించారు.
 
మేం కరివేపాకు కాదు..: ఉద్ధవ్
సాక్షి, ముంబై: కూరలో కరివేపాకులా వాడుకుని మమ్నల్ని బీజేపీ వదిలేసిందని శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. అకోలాలో శనివారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు శివసేన మద్దతు ఇచ్చిందని,  అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ తీరు మారిపోయిందని ఆయన విమర్శించారు. కరివేపాకులా తమను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వారికి నాయకులెవరూ లేకపోవడంతోనే ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి దింపిందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవాచేశారు. మహాకూటమి విడిపోయిన అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే తరచూ బీజేపీపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement