‘రామ్‌లీలా’కి నేతలు దూరం
Published Sat, Oct 12 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
సాక్షి, న్యూఢిల్లీ : రామ్‌లీలా వేదికలు, రాజకీయ నాయకులకు మధ్య అనుబంధానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్నికల సంవత్సరంలో ఇది మరింత బలపడుతుంది. ప్రజాదరణను పెంచుకోవడానికి నేతలు, వారి మద్దతుదారులు రామ్‌లీలా ప్రదర్శనా స్థలాలను ఆశ్రయిస్తారు. ఎన్నికల సీజన్‌లో రామ్‌లీలా వేదికలు పరోక్షంగా ఎన్నికల ప్రచార వేదికలుగా మారుతాయి. రాజకీయ నాయకులను రామ్‌లీలా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. వేదికలపై నుంచి ఒకవైపు నేతలు ప్రసంగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు వారి మద్దతుదారులు నినాదాలతో ప్రేక్షకులను అదరగొట్టేస్తుంటారు.
నగరవాసులకు సుపరిచితమైన ఈ వాతావరణం ఈసారి రామ్‌లీలా ప్రదర్శనా స్థలాల్లో కనిపించడం లేదు. ఎన్నికలు త్వరలో జరగనున్నప్పటికీ ఈ ప్రదర్శనలకు రావడానికి నేతలు వెనకంజ వేస్తున్నారు. ఎన్నికల అధికారులు ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయడమే ఇందుకు కారణం. తమ కదలికలను ఎన్నికల కార్యాలయం కనిపెడుతుందోననే భయంతో పెద్ద నాయకులతోపాటు టికెట్ ఆశిస్తున్న ఛోటామోటా నేతలు కూడా తమ మద్దతుదారులను ఈ మైదాన్ పరిసరాల్లోకి వెళ్లొద్దంటూ ఆదేశించారు. రామ్‌లీలా ప్రదర్శనా స్థలంలో దక్షిణ ఎమ్సీడీ స్థాయీసంఘం చైర్మన్, మటియాలా సీటు కోసం బీజేపీ టికెట్ ఆశిస్తున్న స్తోన్న కౌన్సిలర్ రాజేశ్‌గెహ్లాట్ పేరుతో ఉన్న బ్యాన ర్లు కనిపించడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు జారీచేసింది. దీంతో రాజకీయ నేతలు రామ్‌లీలాలకు దూరంగా ఉండడమే తమ రాజకీ య భవితవ్యానికి క్షేమమనే అభిప్రాయానికి వచ్చా రు. రాజకీయ నాయకులు, వారి మద్దతుదారుల సందడి లేక మైదానాలు బోసిపోయాయని రామ్‌లీలా నిర్వాహకులు కూడా అంగీకరిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ నిఘా వల్ల ఈ ఏడాది ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావహులే కాకుండా ఎంపీలు కూడా రామ్‌లీలా ప్రదర్శనలకు రావడానికి జంకుతున్నారని సదర్‌బజార్ ప్రాంతంలో గడిచిన 60 ఏళ్లుగా రామ్‌లీలా ప్రదర్శిస్తున్న రఘునందన్ లీలా సమితి అధ్యక్షుడు దీపక్ సింఘాల్ చెప్పారు. రామ్ లీలా ప్రదర్శనలకు వస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు కూడా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తమ ఆలోచనను విరమించుకున్నారన్నారు.
ఒకరిద్దరు నేతలు వచ్చినా స్వాగత ద్వారం వద్ద తమతో కొద్దిసేపు మాట్లాడి వెనక్కి వెళ్లిపోతున్నారని చెప్పారు. కాగా ప్రతి రోజూ రామ్‌లీలా వేదికల కార్యకలాపాలను వీడియో తీసి తమ నివేదికతో పాటు ఎన్నికల కార్యాలయానికి పంపుతున్నట్లు ఎన్నికల కమిషన్‌లోని నిఘా బృందానికి చెందిన అధికారి మన్మోహన్ చెప్పారు.
Advertisement