గుజరాత్ కంటే మనమే మేలు : షీలాదీక్షిత్
Published Mon, Oct 21 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విరుచుకుపడ్డారు. ఆయన విద్వేషాగ్నిని, విభజనను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను ప్రపంచమంతటా కొనియాడుతుండగా గుజరాత్‌లో మెజారిటీ ప్రజలకు కనీస వసతులు అందుబాటులో లేవని విమర్శించారు.
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అభివృద్ధి నమూనా కన్నా ఢిల్లీ అభివృద్ధి నమూనా ఎంతో మెరుగైనదని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. నాంగ్లోయ్ వద్ద కిరారీలో శివ సహకార పొదుపు సంఘం ఆదివారం ఏర్పాటు చేసిన వార్షికసభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తలసరి ఆదాయంలో ఢిల్లీ అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండడమే ఇందుకు చక్కటి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను ప్రపంచమంతటా కొనియాడుతుండగా గుజరాత్‌లో మెజారిటీ ప్రజలకు కనీస వసతులు అందుబాటులో లేవని షీలాదీక్షిత్ చెప్పారు. ‘దేశరాజధానిలో 24 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో ఆరు రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు.
వాటిని ఢిల్లీ సర్కారు అతి తక్కువ సమయంలో నెలకొల్పింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పాఠశాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్న బాలికల సంఖ్య ఢిల్లీలోనే అధికంగా ఉంది. ఢిల్లీ సుసంప్నమైన, సంపూర్ణంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం’ అని షీలా దీక్షిత్ ఈ సందర్భంగా వివరించారు. తాము అభివృద్ధితోపాటు సమృద్ది సాధించడంపైనా దృష్టి సారించామని ఆమె చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం వయోధికులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.1,500 పింఛను అందిస్తోందని ఆమె చెప్పారు. మరేదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొత్తం ఇస్తుందా ? అని ఆమె ప్రశ్నించారు. తమది ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించే ప్రభుత్వమని షీలాదీక్షిత్ స్పష్టీకరించారు. ‘మేం విద్వేషాగ్నిని, విభజనను ప్రచారం చేయడం లేదు. అభివృద్ధే ముఖ్యం’ అని ఆమె తెలిపారు.
యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలను అందజేయడానికి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. జౌన్‌పూర్‌లో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం (స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు తమ ప్రభుత్వం సింగపుర్ ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకుందని ఆమె తెలిపారు. ఈ సంస్థ వేల మందికి శిక్షణ ఇస్తుందన్నారు. వీరందరినీ వృత్తివిద్యా నిపుణులుగా మార్చి వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చే శారు. అందరు ఎమ్మెల్యేలకు తమ ప్రభుత్వం సమాన మొత్తాన్ని విడుదల చేసినప్పటికీ కిరారీ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి జరగడం లేదో తనకు అర్థం కావడం లేదని ఆమె తెలిపారు.
తమ ప్రభుత్వం అ తారతమ్యాలను తొలగిస్తుందని ఆమ హామీ ఇచ్చారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆమె వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం పౌర సేవాసంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేస్తుందని ఆమె చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఆమె ప్రజలను కోరారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న అసత్య వాగ్దానాల వెల్లువలో కొట్టుకుపోరాదని సీఎం షీలా దీక్షిత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement