బిల్లుతో సామాన్యుడి గుండె జల్లు
Published Tue, Sep 24 2013 1:13 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: అడ్డగోలు విధానాలతో నీటి బిల్లుల రూపంలో మోపుతున్న భారం చూస్తేనే సర్కార్‌కి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. జల్‌బోర్టు అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులు అధిక మొత్తంలో నీటి బిల్లులు చెల్లించాల్సి వస్తోందని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. ఢిల్లీలోని 40 శాతం ఇళ్లకు మంచినీరు సరఫరా కావడం లేదన్నారు.
15ఏళ్లుగా ఢిల్లీ జల్‌బోర్డు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆధ్వర్యంలోనే పనిచేస్తోందన్నారు. 30 శాతం వరకు తప్పుడు బిల్లులు వస్తున్నట్టు ఇప్పటికే నిరూపితమైందన్నారు.‘పదిహేనేళ్లలో నీటి బిల్లులు వెయ్యిశాతం పెరిగాయన్న విషయం విస్మయానికి గురిచేసింది. డీజేబీ అక్రమంగా 30 శాతం వరకు అదనపు బిల్లులు జారీ చేస్తూ సామాన్యుడి నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది.
పస్తుతం వసూలు చేస్తున్న నీటి బిల్లుల టారిఫ్ కాగ్ నివేదికల్లో ఇది ముంబై కంటే 9 శాతం ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు’అని గోయల్ అన్నారు. ఇప్పటికే లక్షల్లో నీటి బిల్లులు చెల్లించి ఢిల్లీవాసులు విసిగిపోయారన్నారు. డీజేబీ అధ్యక్షురాలుగా 15ఏళ్లుగా ఉన్న షీలాదీక్షిత్ ప్రజల నీటి అవసరాలు తీర్చలేకపోయారన్నారు. అదేవిధంగా యమునా నీటి శుద్ధి విషయంలోనూ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల నీటి కష్టాలు తీరుస్తామన్నారు.
Advertisement