డూసూ ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడిగా పోస్టర్ల ఏర్పాటు
Published Tue, Sep 3 2013 12:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాలను వికారంగా మార్చడానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండాపోతోంది. అనేక రాజకీయ పార్టీల అండదండలతో ఢిల్లీ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యునియన్ (డూసూ) ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆశావహులైన యువనాయకులు నగరంలోని సబ్‌వేలు, ఫ్లైఓవర్లు, వంతెనలపై నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు అంటించారు. ఈ నెల 13వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నాయి. బరిలోకి దిగుతున్న విద్యార్థులకు సంబంధించిన తుది జాబితా ఈ నెల ఆరో తేదీన విడుదల కానుంది. అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ).
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఈ జాబితా కోసం ఎంతమాత్రం ఎదురుచూడకుండా ఎన్నికల పోరును ముమ్మరం చేశాయి. డీయూలో కొత్తగా చేరేవారిని ఆకట్టుకునేందుకు ఆశావహ అభ్యర్థుల పోస్టర్ల ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. విద్యార్థి సంఘాల ఎన్నికలపై ఏర్పాటైన లింగ్డో కమిటీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోస్టర్లతో బహిరంగ ప్రదేశాలను అందవికారంగా మార్చకూడదు. ఎన్నికల ప్రచారానికి చేత్తో పెయింట్ వేసిన కరపత్రాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే అనేక కళాశాలలు, సబ్‌వేలు, ఫ్లైఓవర్ గోడలపై ప్రస్తుతం వందలాది పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. డీయూ ఉత్తర, దక్షిణ ప్రాంగణాలతోపాటు రింగ్‌రోడ్డులపైనా ఇవే ఉన్నాయి.
యువత తెలుసుకోవాలి...
ఇదే విషయమై వాలంటరీ పోస్టర్ హటావో సంస్థ సహస్థాపకుడు కల్నల్ శివరాజ్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలపై పోస్టర్లు అంటించి వాటిని అందవికారంగా మారుస్తున్నామనే విషయాన్ని యువత గమనించాలన్నారు. అలా గమనించకపోవడం పౌరచైతన్యానికి ఓ మరక లాంటిదన్నారు. ఇలా విచ్చలవిడిగా పోస్టర్లు అంటించడంపై కార్పొరేషన్‌తోపాటు నగర పోలీసులకు ఈ సంస్థ ఫిర్యాదుచేసింది. నిబంధనలను ఉల్లంఘించడంలో యువత ముందుండడం బాధాకరమన్నారు. ఒకచోట ఏర్పాటుచేసిన పోస్టర్లను తాము తొలగించగానే మరోచోట అవి వెలుస్తున్నాయని శివరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత వ్యక్తిని అనర్హుడిగా చేయడంతోపాటు శిక్ష విధించాలని ఎన్నికల నియమావళి చెబుతోందన్నారు.
మేమేమీ చేయలేం...
పోస్టర్ల విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయ అధికారులను ప్రశ్నించగా తామేమీ చేయలేమంటూ జవాబిచ్చారు. ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం, 2007 కింద పోలీసులే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చట్టం కింద అభియోగాలు రుజువైతే ఏడాది కారాగారశిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తారన్నారు.
నిఘా పెంచాం: డీసీపీ
విద్యార్థి సంఘాలు నిబంధనలను ఉల్లంఘించకుండా చేసేందుకుగాను విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణం పరిసరాల్లో నిఘా పెంచామని డీసీపీ సింధు పిళ్లై తెలిపారు. గత వారం పోస్టర్లు అంటిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డూసూ ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అయితే విద్యార్థి సంఘాల వాదన మరోవిధంగా ఉంది. పోస్టర్లను ఏర్పాటుచేసుకునేందుకు చట్టబద్ధంగా కొన్ని ప్రాంతాలను తమకు కేటాయించేదాకా నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంటామని పేర్కొన్నాయి. నగరవ్యాప్తంగా అనేక కళాశాలలు ఉన్నాయని, ప్రతి విద్యార్థికి తెలియాలంటే పోస్టర్లు ఒక్కటే మార్గమని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోహిత్ చౌదరి తెలిపారు.
Advertisement