ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రధాన పార్టీల అడుగులు
Published Thu, Aug 29 2013 12:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఛత్ పండుగకు అధికారిక సెలవు దినం ప్రకటిస్తామంటూ పూర్వాంచలీయులను ఆకట్టుకునేందుకు ఒకవైపు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో తమకు 30కి మించి స్థానాలు రావంటూ విభిన్న సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలడంతో దలేర్ మెహందీతో పంజాబీ, సిక్కు ఓటర్లను. ఆసిఫ్‌ఖాన్‌తో ముస్లిం ఓటర్లను, రామ్‌వీర్ సింగ్‌బిధూడీ, రామ్‌సింగ్ నేతాజీలతో గుజ్జర్ ఓటర్లను ఆకట్టుకోవాలని మరోవైపు కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.
న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వస్తే ఛత్ పండుగరోజున ప్రభు త్వ సెలవు దినం ప్రకటిస్తామంటూ బీజేపీ బుధవారం ప్రకటించింది. దీంతోపాటు అనేక వరాల జల్లులు కురిపించింది. నగరంలో బుధవారం జరిగిన పార్టీ పూర్వాంచల్ మోర్చా సమావేశాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ ప్రసంగించా రు. పూర్వాంచలీయులకు వైద్యసదుపాయాలు, ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. వారితోపాటు నగరంలోని నిరుపేదల కోసం పది లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ‘పూర్వాంచలీయులకు సమానావకాశాలు కల్పిస్తాం. మేము అధికారంలోకి వస్తే ఛత్ పండుగ రోజున ప్రభుత్వ సెలవు దినం ప్రకటిస్తాం.
ఆర్థికంగా అత్యంత వెనకబడిన వారిలో వందలాదిమంది పూర్వాంచలీయులు కూడా ఉన్నార ని నితిన్ అన్నారు. వీరంతా కూలీలు, రిక్షాలాగేవారిగా అవతారమెత్తి జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఒకవేళ తమ పార్టీ కనుక అధికారంలోకి వస్తే నగరంలో నివసిస్తున్న 40 లక్షలమంది నిరుపేదలకు ఉచిత ఆరోగ్య బీమా వంటి వైద్యసదుపాయా లు కల్పిస్తామన్నారు.
అధికారంలోకి వస్తే వెంటనే తమ ప్రభుత్వం పది లక్షల ఇళ్లు నిర్మిస్తుందని, అందులో అత్యధిక శాతం ఇళ్లను పూర్వాంచలీయులకే కేటాయిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా విద్యుత్ చార్జీలను 30 శాతంమేర తగ్గిస్తామన్నారు. వలసవచ్చినవారి కారణంగానే నగరంలో నేరా లు జరుగుతున్నాయన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అధికారం ఎక్కడుందన్నా రు. కాగా పూర్వాంచలీయులు ప్రాథమికంగా బీహార్, జార్ఖండ్, తూర్పుఉత్తరప్రదేశ్‌వాసులు.
సామాన్యుడి జీవనం దుర్భరం
కాంగ్రెస్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీశాయని నితిన్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం 18 శాతానికి చేరుకుందన్నారు. దీంతో సామాన్యుడి జీవనం దుర్భరమైందన్నారు. అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీలకే రిజర్వ్ చేసిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక శాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో తాను ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించానన్నారు. ‘మీరుగానీ లేదా మన్మోహన్‌సింగ్ గానీ రాష్ట్రపతి పదవిని అధిరోహించవచ్చు. ప్రధానమంత్రి కూడా అవొచ్చు. అయితే ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మాత్రం చేపట్టలేరు’ అని తాను ప్రణబ్‌తో అన్నట్టు నితిన్ తెలిపారు. సర్వం అవినీతిమయం గా మారిందన్నారు. ‘విమానరంగం, టెలికం రంగం, ఆ తర్వాత బొగ్గు మంత్రి త్వ శాఖ. ఈ మూడు రంగాల్లో లక్షలాది కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరిగాయి’ అని అన్నారు.
సీఎంకు పట్టింపేదీ : విజయ్‌గోయల్
పూర్వాంచలీయులను గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించా రు. వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. వారికి కనీస వసతులు కల్పించలేదన్నారు. నగరంలో నేరాలకు వారినే బాధ్యులుగా చూపుతోందన్నారు. అసలు పూర్వాంచలీయులే లేకుంటే నగరాభివృద్దిని ఊహించలేమన్నారు. రేషన్ కార్డులు, డ్రైవింగ్ లెసైన్సులు, ఆధార్ కార్డులు పొందడంలో పూర్వాంచలీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Advertisement