కార్పొరేషన్‌ల వల్లే ఈ పరేషాన్!
Published Sat, Sep 28 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
న్యూఢిల్లీ: నగరంలో డెంగీ వ్యాధి విజృంభించడానికి కారణం బీజేపీ ఆధ్వర్యంలోని మున్సిపల్ కార్పొరేషన్ల వైఫల్యమేనని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆరోపించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ప్రజల కనీస అవసరాలైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించడం, దోమల సంఖ్య పెరగకుండా చర్య లు తీసుకోవడం వంటివాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రస్తుతం డెంగీ విలయ తాండవం చేస్తోందన్నారు. అయితే కార్పొరేషన్లలో అధికారం లో ఉన్న బీజేపీలాగే తామూ చేతుల ముడుచుకొని కూర్చోలేమని, డెంగీ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామన్నారు.
దోమల నగరంగా ఢిల్లీని ఎంతమాత్రం మారనీయమని, వాటితో పోరాటానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నా రు. గత నాలుగైదు రోజుల్లో డెంగీ కారణంగా ము గ్గురు మృతిచెందగా 1,700మందికి డెంగీ వ్యాధి సోకిందనే లెక్కలను కార్పొరేషన్లే చెబుతున్నాయన్నారు. గురువారం ఒక్కరోజే 374 మంది ఈ వ్యాధిబారిన పడ్డారని చెప్పుకుంటున్న కార్పొరేషన్లు వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు. మూడు కార్పొరేషన్లకు చెందిన 3,500 మంది దోమల నియంత్రణ కోసం పనిచేస్తున్నారని చెబుతున్నా మరి వాటి సంఖ్య ఎందుకు తగ్గడంలేదని ప్రశ్నించారు.
రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం...
బీజేపీలాగా హామీలిచ్చి తప్పించుకునే ప్రభుత్వం తమది కాదని, డెంగీ రోగు ల కోసం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 700 మంచాలను సిద్ధంగా ఉం చామని షీలాదీక్షిత్ చెప్పారు. అంతేకాక సరిపడా ప్లేట్‌లెట్లను కూడా సిద్ధం చేశామన్నారు. డెంగీ కారణంగా ఏ ఒక్క రోగి ఆస్పత్రికి వచ్చినా చేర్చుకోవడానికి నిరాకరించొద్దని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ల్యాబ్‌లో అదనంగా సిబ్బం దిని నియమించామని, డెంగీ కారణంగా ఎవరూ మృత్యువాత పడకూడదనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ఏడాది సెప్టెం బర్‌లో 1,567 డెంగీ కేసులు నమోదు కాగా గత సంవత్సరం కేవలం 52 కేసులే నమోదయ్యాయని, అంతకుముందు సంవత్సరం 172 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఇక ఆగస్టు విషయానికి వస్తే.. ఈ ఏడాది 142 కేసులు నమోదు కాగా 2012లో కేవలం నాలుగు కేసులు, 2011లో 51 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కూడా పెంచిందని చెప్పారు. గత సంవత్సరం రూ.76 కోట్లు మంజూరు చేయగా ఈ ఏడాది రూ.87.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ. 65 కోట్లు మంజూరు కూడా చేశామని చెప్పారు. అయితే కార్పొరేషన్లు మాత్రం ఇప్పటిదాకా కేవలం 14 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశాయని, దీనినిబట్టి వాటికి ప్రజారోగ్యం పట్ల ఎంతటి శ్రద్ధ ఉందో తెలిసిపోతోందన్నారు. కనీసం ఇప్పటికైనా మేల్కొ ని ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించాలని, దోమల సంఖ్యను నియంత్రించి, డెంగీని అరికట్టాలని కార్పొరేషన్లకు సూచించారు.
Advertisement