చికిత్స పొందుతూ ‘పవిత్ర’ మృతి
Published Tue, Oct 8 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
న్యూఢిల్లీ: భీమ్‌రావ్ అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపల్ జీకే అరోరా లైంగికంగా వేధించాడని ఒంటిపై కిరోసిన్ పొసుకొని ఆత్మహత్యాయత్నం చేసి తీవ్రంగా కాలిన మాజీ లాబొరేటరీ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. ఏడు రోజుల క్రితం ఢిల్లీ సెక్రటేరియట్‌లోని గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పొసుకొని 35 ఏళ్ల పవిత్ర భరద్వాజ ఆత్మహత్యాయత్రం చేసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆమెను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి సోమవారం ఉదయం మరణించిందని పోలీసులు తెలిపారు.
అయితే ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్‌లో భీమ్‌రావ్ అంబేద్కర్ కాలేజ్ ప్రిన్సిపల్ జీకే అరోరాతో పాటు మరో వ్యక్తి శారీరకంగా, మానసికంగా వేధింపులకు దిగడంతో ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డానని పేర్కొందన్నారు. రెండేళ్ల క్రితం పవిత్ర భరద్వాజను ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రిన్సిపల్‌తో పాటు ఇతర వ్యక్తులను విచారించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ (సెంట్రల్) అలోక్ కుమార్ తెలిపారు. అయితే పవిత్ర భరద్వాజ మరణించడంతో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు జీకే అరోరాను ప్రిన్సిపల్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు నింపాదిగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటివరకు ప్రిన్సిపల్‌తో పాటు మరో ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ప్రిన్సిపల్ శారీరకంగా వేధిస్తున్నాడని లైంగిక వేధిం పుల వ్యతిరేక కమిటీ, యూనివర్సిటీ ఉన్నత కమిటీకి ఫిర్యాదు చేసినా అరోరాకు క్లీన్‌చీట్ ఇచ్చారని మృతురాలి బంధువులు ఆరోపించారు. వెంటనే ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇప్పటివరకు సర్కార్, విద్యాశాఖ నుంచి మృతురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎవరూ రాలేదు. ప్రిన్సిపల్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అతడిని అరెస్టు చేస్తేనే కేసు సరిగా విచారణ జరుగుతుంద’ని భరద్వాజ సోదరుడు సంజీవ్ అన్నారు. పవిత్ర భరద్వాజను ఆదివారం బీజేపీ నాయకుడు విజయ్ జాలీ, ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తి మెహ్రా కలిసి పరామర్శించారు.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, విద్యాశాఖ మంత్రి బాధితురాలిని పరామర్శించకపోవడంపై నిప్పులు చెరిగారు. కాగా పాఠశాల, కళాశాలల్లో లైంగిక వేధింపులు జరుగుతుండటం దురదృష్టకరమని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ కేసు తమ వద్దకు రాలేదని, ఒకవేళ వస్తే దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.
Advertisement