బీజేపీవి మోసపూరిత హామీలు
Published Thu, Sep 19 2013 1:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కడానికి భారతీయ జనతా పార్టీ ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. రూ. 15.5 కోట్ల ఖర్చుతో రోహిణి సెక్టార్ -28 లో టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీపీడీడీఎల్) నిర్మించిన 66 కేవీ గ్రిడ్ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షీలా మాట్లాడుతూ బీజేపీ హామీలు ఆచరణ సాధ్యం కానివని ఎద్దేవా చేశారు. తమకు అవకాశమిస్తే కరెంటు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై షీలా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం విద్యుత్ చార్జీలు తగ్గించాలంటే ఆ మేరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని ఆమె విశ్లేషించారు.
‘కరెంటు చార్జీల విషయంలో బీజేపీ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తోంది. 30 శాతం కరెంటు సరఫరాను నిలిపివేస్తేనే విద్యుత్ చార్జీల్లో 30 శాతం తగ్గించగలుగుతారు..’ అని ఆమె అన్నారు. మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో కరెంట్ చార్జీలు చాలా తక్కువని షీలా చెప్పారు. ‘రోహినీలో ఏర్పాటుచేసిన సబ్ స్టేషన్ వల్ల రోహినీ, ప్రహ్లాద్‌పూర్ ప్రాంతాల్లో లక్షకు పైగా వినియోగదారులకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. నగరంలో ప్రతి యేడాది కరెంట్ వాడకం పెరుగుతోంది. ఈ సబ్‌స్టేషన్ వల్ల రోహినీ, చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించవచ్చు. ఉత్తర, వాయవ్య ఢిల్లీలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు టీపీడీడీఎల్ చేస్తున్న కృషి అభినందనీయం..’ అని షీలాదీక్షిత్ అన్నారు.
టీపీడీడీఎల్ సీఈవో ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకనుగుణంగా తమ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సబ్‌స్టేషన్ వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యపడుతుందన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కరెంట్ చార్జీల విషయంలో షీలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేం దుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కడితే ప్రస్తుతం షీలా సర్కారు వసూలుచేస్తున్న చార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని హామీ ఇస్తోంది.
జాతి ఆశించేలా విద్యార్థులు ఎదగాలి
దేశం, జాతి ఆశించేలా ఎదగాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సూచించారు. రూ.19 కోట్ల వ్యయంతో జహంగీర్‌పురాలో నిర్మించిన ఐదు అంతస్తుల సర్వోదయ కన్య విద్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల గదులన్నింటినీ ఎయిర్‌కండిషన్డ్‌గా మార్చాలన్న ఆలోచన ఉందన్నారు. నూతన భవనంలోని 46 తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ,పెద్ద హాలు విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయన్నారు.
త్వరలోనే ప్రహరీగోడతోపాటు క్రీడామైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పాఠశాలల్లోని తరగతి గదులకు ఇంటర్‌నెట్ సదుపాయం, విద్యార్థినులకు ఆకాశ్ ట్యాబ్‌లెట్లను త్వరలోనే అందజేస్తామని కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ పేర్కొన్నారు. జహంగీర్ పురాలోని ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 24,484 మంది విద్యార్థులు చదువుతున్నారని నగర విద్యాశాఖ మంత్రి కిరణ్ వాలియా పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాంసింఘాల్, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement