సాక్షి, చెన్నై: డిపాజిట్ల గల్లంతు డీఎంకే వర్గాల్ని కలవరంలో పడేశాయి. రాష్ర్ట చరిత్రలో ప్రప్రథమంగా తమకు ఎదురైన ఘోరపరాభవాన్ని కరుణ సేన జీర్ణిం చుకోలేకపోతోంది. డీఎంకే పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న దళపతి స్టాలిన్‌కు ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం డీఎంకేను వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి చవి చూడడం ఆ పార్టీని కుంగదీసింది. లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ సత్తాను చాటుకోవాలన్న లక్ష్యంతో అధినేత ఎం.కరుణానిధి వ్యూహ రచనల్లో పడ్డారు. యూపీఏ కూట మి నుంచి బయటకు వచ్చాక, తమిళ సంక్షేమ నినాదంతో ప్రజల్ని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ ప్రజాకర్షనే ధ్యేయంగా ముందుకు కదిలారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకునేలా మెగా కూటమికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కాం గ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టి, చివరకు వీసీకే, ఎంఎంకే, ఇండియన్ యూనియ న్ ముస్లింలీగ్, పుదియ తమిళంగంతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నారు.
గెలుపు ధీమా: రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యుత్ కోతలు, ప్రజల పడుతున్న కష్టాలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తాయన్న ఆశ డీఎంకేలో నెలకొంది. ఈ క్రమంలోనే 35 స్థానాల్లో తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. కూటమిలోని వీసీకే రెండు, మిగిలిన మిత్రులు తలా ఓ చోట రేసులో నిలబడ్డారు. గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాధ్యతల్ని డీఎంకే కోశాధికారి, దళపతి ఎంకే స్టాలిన్ తన భుజాన వేసుకున్నారు. కోల్పోయిన వైభవాన్ని ఈ ఎన్నికల ద్వారా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కరుణానిధి సైతం ప్రచార బరిలో దిగారు. వయో భారంతో ఉన్న ఆయన రాష్ట్రంలో చేసిన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది.
దీంతో డీఎంకేలో గెలుపు ధీమా పెరిగింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా రావడంతో డీఎంకే వర్గాలు విస్మయంలో పడ్డాయి. కనీస 15 సీట్లరుునా దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ వర్గాలకు చివరకు మిగిలింది డిపాజిట్ల గల్లంతు. ముఖ్యమంత్రి జయలలిత హవా ముందు డీఎంకే అభ్యర్థులు తలవంచక తప్పలేదు. పార్టీ బహిష్కృత నేత అళగిరి మద్దతుదారులు తిరుగు బావుటా ఒక వైపు, ప్రజల్లో తమ మీద చల్లారని ఆగ్రహం వెరసి డిపాజిట్లు గల్లంతు కావడాన్ని కరుణ సేన జీర్ణించుకోలేకపోతోంది. కూటమిలోని వీసీకే నేత తిరుమావళవన్ చిదంబరంలో కాసేపు ఆధిక్యత ప్రదర్శించినా, చివరకు ప్రజా తీర్పుకు తలవంచక తప్పలేదు. తమ మీదున్న అవినీతి ఆరోపణలు, గతంలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరబాట్లు ప్రజల్లో ఆక్రోశాన్ని నేటికీ రగుల్చుతుండడం డీఎంకే వర్గాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరుణానిధి వారసుడిగా డీఎంకే పగ్గాలు చేజిక్కించుకుని ఏడాదిన్నర తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకాతో సీఎం కావాలన్న ఆశతో ఉన్న స్టాలిన్‌కు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్‌ను ఇచ్చాయి.
ఉద్దండుల ఓటమి
డీఎంకేలో ఉద్దండులుగా ఉన్న సీనియర్లు, కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన వారు, వరుస విజయాలతో దూసుకొచ్చిన వారికి ఈ ఫలితాలు పెద్ద గుణపాఠాన్నే నేర్పాయి. ఆ పార్టీ అధినేత కరుణానిధి మనవడిగా, కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన, సెంట్రల్ చెన్నై నుంచి వరుస విజయాలతో దూసుకొచ్చిన దయానిధి మారన్‌కు ఓటమి తప్పలేదు. 2జి స్పెక్ట్రమ్ అవినీతి కుంభకోణం వీరుడు ఏ రాజాకు నీలగిరిలో ఓటర్లు పెద్ద శిక్షే వేశారు. బొగ్గు కుంభకోణం తనను ఎక్కడ వెంటాడుతుందోనన్న భయంతో ఆ శాఖ మాజీ మంత్రి జగద్రక్షగన్ తన మకాంను అరక్కోణం నుంచి శ్రీ పెరంబదూరుకు మార్చినా గెలుపు మాత్రం వరించలేదు. గత ఎన్నికల్లో శ్రీపెరంబదూరు నుంచి చివరి రౌండ్లో గట్టెక్కిన డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలును ఈ సారి సొంత జిల్లా తంజావూరు ఓటర్లు తిరస్కరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో తన ఇలాఖాను చక్కదిద్దుకున్నా, నామక్కల్ ఓటర్లు మాత్రం గాంధీ సెల్వన్ మీద కరుణ చూపించ లేదు.
నిశ్శబ్దం
ఎప్పుడూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడే డీఎంకే కార్యాలయ ఆవరణాన్ని శుక్రవారం నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. జిల్లా పార్టీ కార్యాలయాల వద్ద కూడా ఇదే పరిస్థితి. ఓటమిని జీర్ణించుకోలేని పార్టీ వర్గాలు అటు వైపు తొంగిచూడక పోవడం గమనార్హం.
డిపాజిట్లు గల్లంతు
Published Fri, May 16 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement