విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తీసుకోబోమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ స్పష్టం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదు : డీకేశి
బెంగళూరు : విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తీసుకోబోమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో మౌలిక సదుపాయాల కల్పన, వనరుల క్రోడీకరణకు గాను విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి యూనిట్‌కు 80పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు అనుమతించాల్సిందిగా కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అధారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం యూనిట్‌కు 13పైసల చొప్పున మాత్రమే విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించిందని చెప్పారు. ఈ నెలాఖరులో అన్ని ఎస్కాంల పరిధిలోని అధికారులు సమావేశమై విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చించనున్నారని పేర్కొన్నారు.
పరీక్షా సమయంలో విద్యుత్ కొరత రానివ్వం....
ఇక పరీక్షల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందించనున్నట్లు డి.కె.శివకుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 6గంటల పాటు త్రీఫేస్ విద్యుత్, విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గాను 24గంటల పాటు సింగిల్ ఫేస్ విద్యుత్‌ను అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు కేవలం 2గంటలు మాత్రమే విద్యుత్‌ను అందజేస్తున్నట్లు ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని డి.కె.శివకుమార్ తెలిపారు.