![భీకరి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61496437461_625x300.jpg.webp?itok=UEpiPjOn)
భీకరి
► గజరాజు బీభత్సం
► నలుగురి మృతి
► శోకసంద్రంలో కోవై
► మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా
గజరాజు అంటూ ప్రజలచే గౌరవంగా పిలిపించుకునే ఏనుగు ఆ ప్రజల ప్రాణాలనే హరించి వేసింది. ప్రజలను వెంటపడి తరిమింది. పదిగంటలకు పైగా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల చిన్నారిని కాలితో చిదిమేసింది. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వృద్ధులను చంపేసింది. అటవీ, పోలీసు శాఖల వందలాది మంది అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మదంపట్టిన గజరాజు మారణకాండ వివరాలు ఇలా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు నగరానికి ఆనుకునే పోత్తనూరు, వెల్లలూరు, కోవైపుత్తూరు, మధుకరై ప్రాంతాల్లో అడవి ఏనుగులు ఊళ్లోకి చొరబడి ప్రజలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. అటవీ అధికారులపై ఆశలు పెట్టుకోకుండా ప్రజలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే శుక్రవారం నాడు జరిగిన గజరాజు బీభత్సాన్ని మాత్రం జనం మరువలేకున్నారు. పోత్తనూర్ సమీపం గణేశపురం మురనండమ్మాళ్ ఆలయం వీధిలో నివసించే విజయకుమార్ (30) హస్తసాముద్రిక జోస్యం నిపుణుడు. ఇతని కుమార్తె గాయత్రి (12). ఎండకాలం కావడంతో ఇద్దరూ ఇంటి వసారాలో నిద్రపోయారు.
శుక్రవారం తెల్లవారుజాము 3.15 గంటల సమయంలో మదం పట్టిన ఒక అడవి ఏనుగు ఆలయ వీధిలోకి ,చొరబడింది. ఇష్టం వచ్చినట్లుగా విహరిస్తూ ఇంటి వసారాలో గాయత్రిపై విరుచుకుపడి కాలితోతొక్కి నలిపేయడంతో సంఘటన స్థలంలోనే చిన్నారి మృతి చెందింది. కుమార్తెను కాపాడేందుకు విజయకుమార్ ముందుకు వెళ్లడంతో ఏనుగు తన తొండతో అతన్ని చుట్టి దూరంగా గిరాటు వేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఏనుగు విలయతాండవానికి భయభ్రాంతులకు గురైన ప్రజలు దాన్ని అడవుల్లోకి తరిమివేసేందుకు ప్రయత్నించారు.
కర్రలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు తరుముకోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని పంట పొలాల్లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో పొలాల్లో బహిర్భూమికి వెళుతున్న జ్యోతిమణి (60), నాగరత్నం (50) అనే ఇద్దరు మహిళలపై దాడి చేయగా వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ పరిసరాల ప్రజలు త్రిశూలాలు, కమ్ములు, కత్తులు పట్టుకుని ఏనుగు వెంటపడ్డారు. దీంతో మరింత ఆవేశానికి లోనైన గజరాజు వారికి ఎదురుతిరగడంతో భయపడిన ప్రజలు తలోదిక్కుగా పారిపోయారు. ఊరి శివార్లలోని తన తోటకు నీళ్లుపట్టేందుకు బయలుదేరిన పళనిస్వామి (73) ఏనుగు బీభత్సాన్ని చూసేందుకు అగిపోయాడు. దీంతో ఒక్క ఉదుటన అక్కడి చేరుకున్న ఏనుగు పళనిస్వామిపైనా దాడి చేసింది.
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే పళనిస్వామి (73) ప్రాణాలు కోల్లోయారు. మరో నలుగురిని గాయపర్చిన ఏనుగును అడవుల్లోకి తరిమేందుకు అటవీఅధికారులు బాణసంచా కాల్చారు. అయితే టపాసుల చప్పుళ్లకు ఏమాత్రం జంకని ఏనుగు ఆ పరిసరాల్లోనే తచ్చాడుతూ గడిపింది. ఇంతలో తెల్లారిపోయి ప్రజలంతా రోడ్లపైకి రావడంతో ఏనుగు మరింత విజృంభించి ఊళ్లోకి ప్రవేశిస్తే మరింత ప్రమాదమని భావించిన అధికారులు బాణసంచా కాల్చడం నిలిపివేశారు. దీంతో ఏనుగును అటవీవైపు మళ్లించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇక లాభం లేదనుకుని మదపుటేనుగును తమవైపు ఆకర్షించుకుని అడవిదారి పట్టించే సామర్థ్యం కలిగిన కలీమ్, మారియప్పన్, పారీ, సుజయ్ అనే నాలుగు గుమ్కీ ఏనుగులను రప్పించారు.
అలాగే మరోవైపు మత్తు ఇంజక్షన్లను ఇచ్చేందుకు పశువైద్యులు, ఆయుధాలతో కోయంబత్తూరు నగర పోలీసులు సైతం సిద్ధమయ్యారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో పశు వైద్యులు మనోహరన్ ఆ ఏనుగుకు రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అదుపులోకి తెచ్చుకున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు ఎవ్వరూ రాకుండా 150 మంది పోలీసులు బందోబస్తులో నిలిచారు. ఈ సమయంలో ప్రజల సహాయాన్ని తీసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పశువైద్యులు జీపులో 25 అడుగుల దూరం నుంచి తుపాకీల ద్వారా మదపుటేనుగుపై మత్తు ఇంజక్షన్లను ఇచ్చారు.
కొద్దిసేపటికి ఏనుగు స్పృహతప్పడంతో బలమైన తాళ్లు కట్టి అదుపులోకి తీసుకున్నారు. స్పృహ వచ్చిన తరువాత లారీలో తరలించారు. ఏనుగులు సంచరించే భూములను ప్రజలు ఆక్రమించి నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే గజరాజులు దాడులు చేస్తున్నాయని అధికారులు అంటున్నారు.సీఎం రూ.4లక్షల నష్టపరిహారం: ఏనుగు దాడిలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నష్టపరిహారాన్ని ప్రకటించారు.