సాక్షి, చెన్నై : డిమాండ్లపై స్పందించకుంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓటు ఆయుధాన్ని ప్రయోగించాల్సి ఉంటుందన్న హెచ్చరికలకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం మూడు లక్షల మందితో కూడిన కార్యాలయ అసిస్టెంట్ , కింది స్థాయి ఉద్యోగుల సంఘం ఏకంగా హెచ్చరికల్ని జారీ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఆందోళన బాట పట్టి ఉన్న విషయం తెలిసిందే. వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరిగినా, ఫలితం శూన్యం.
అసెంబ్లీలో తమకు అనుకూలంగా సీఎం జయలలిత ఎలాంటి ప్రకటన చేయని దృష్ట్యా, ఆయా సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పక్షానికి గట్టిగా బుద్ధి చెప్పే దిశగా హెచ్చరికలకు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో తమకు కళ్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కి, చివరకు హామీల్ని విస్మరించిన జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు ఓటు ఆయుధంతో బుద్ది చెప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఒక్క సంఘం ఏ విధంగా నిరసనల బాట పట్టి ఉన్నాయో అదే తరహాలో హెచ్చరికల స్వరాన్ని పెంచేందుకు చర్యల్లో మునిగి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం ఏకంగా కార్యాలయ అసిస్టెంట్, కింది స్థాయి ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బుద్ది చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం చెన్నైలో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఆ సంఘం నేత గణేషన్ మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లను గుర్తు చేశారు.
వాటిపై సీఎం జయలలిత స్పందించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఓటు ఆయుధాన్ని వ్యతిరేకంగా ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎ న్నికల్ని బహిష్కరించడం లేదా, మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. ఓ వైపు ఉద్యోగులు ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకుంటుంటే, మరో వైపు ఓటింగ్ శాతం పెంపునకు అన్ని వర్గాల్ని సమావేశ పరిచే విధంగా ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖాని చర్యలకు సిద్ధమయ్యారు.
ఓటింగ్ శాతం పెంపు :
సర్వత్రా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అందరి అభిప్రాయాల సేకరణ, సమస్యల అధ్యయనం కోసం సమావేశాలకు రాజేష్ లఖాని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం మానసిక వికలాంగులతో సమావేశమయ్యారు. వికలాంగులు, అంధుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఈసందర్భంగా మీడియాతో రాజేష్ లఖాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిస్తూ ముందుకు సాగుతున్నామని, అందర్నీ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకొస్తామన్నారు.
వికలాంగుల సమస్యల్ని అధ్యయనం చేశామని, 1918 పోలింగ్ కేంద్రాల్లో వీరి కోసం ప్రత్యేకంగా ర్యాంప్, వీల్ చైర్స్‌లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అలాగే, బ్రెయిలి విధానంతో ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయనున్నామన్నారు.
ఓటుతో వేటు
Published Tue, Feb 23 2016 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement