రాసలీలలపై రహస్య విచారణ
డీఎస్పీ సర్కారుపై బిగుసుకుంటున్న ఉచ్చు
రంగంలోనికి దిగిన నిఘా బృదం
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ రాసలీలలపై రహస్య విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక నిఘా బృందాన్ని జమ్మలమడుగుకు పంపించి విచారణ జరిపిస్తుండటంతో డీఎస్పీకి సహకరించిన సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ కాలేజి అమ్మాయిలతో తన కార్యాలయంలో రాసలీలు సాగిస్తూ వచ్చిన వికృత చేష్టలను సాక్షి దినపత్రిక వెలుగులోనికి తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. దాదాపు పది మంది అమ్మాయిలను డీఎస్పీ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్క అమ్మాయి ఫిర్యాదు చేసినా సదరు అధికారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డీఎస్పీకి సహకరించిన వారిలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.