
సాక్షి, ముంబై : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ మాజీ అధ్యక్షుడు జయంత్ ససానే (60) సోమవారం ఉదయం కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన అహ్మద్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1985లో మొదటిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1999–2009 వరకు శ్రీరాంపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 15 ఏళ్లు నగరాద్యక్షుడిగా కొనసాగారు. 2004లో అప్పటి ప్రభుత్వం ససాణే అ«ధ్యక్షతన సాయి సంస్థాన్ ధర్మకర్తల మండలి స్థాపించింది. తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో ఆయన సాయి సంస్థాన్ రూపురేఖలు మార్చివేశారు. ఆసియా ఖండంలోని వివిధ పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ఎక్కడా లేని రీతిలో షిర్డీలో అతి పెద్ద ప్రసాదాలయం, సోలార్ ప్రాజెక్టు నిర్మించారు. భక్తుల హుండీలో వేసిన కానుకలతో 2007లో 23న బాబాకు బంగారు సింహాసనం తయారు చేయించారు. సాయిబాబా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతోపాటు అందులో గుండె శస్త్రచికిత్స సేవలను కూడా ససాణే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment