కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు పీటర్, విశ్వనాథ్ సిద్ధం
అప్పుడో మాట...ఇప్పుడో మాటా?
తమాకా నేత ఆగ్రహం
చెన్నై: అసంతృప్తి నేతలు వాసన్‌కు టాటా చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తమాకాలో కీలక నేతగా ఉన్న పీటర్ అల్ఫోన్స్, మాజీ ఎంపీ విశ్వనాథన్‌లతో పాటుగా పలువురు బుధవారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరి చర్యలను జీకే వాసన్ తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ సమావేశం లో అంగీకరించి, ఇప్పుడేమో అసంతృప్తి వ్యక్తం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమిలోకి తమాకా చేరడాన్ని ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమాకా నేత జీకే వాసన్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న జ్ఞానదేశికన్ మినహా తక్కిన వారందరూ తిరుగు బాటు ధోరణిలో పయనిస్తున్న విషయం తెలిసిందే. నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని, లేదా, బలమున్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ఒంటరిగా అభ్యర్థులను రంగంలోకి దించుతామన్న డిమాండ్‌ను అసంతృప్తి, తిరుగుబాటు నేతలు వాసన్ ముందు ఉంచారు.
అయితే, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వాసన్ తేల్చడంతో ఇక, ఇక్కడ ఉండటం కన్నా సొంతగూటికి వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి ఆ నాయకులు వచ్చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి తగ్గ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. బుధవారం చెన్నైకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ రానున్నడంతో ఆయన సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పీటర్ అల్ఫోన్స్‌తో పాటుగా, విశ్వనాథన్‌తదితర నాయకులు సిద్ధమయ్యారు.
వీరితో పాటుగా పదిహేను జిల్లాలకు చెందిన తమాకా అధ్యక్షులు, కార్యవర్గంతో పాటు, ఇతర జిల్లాల్లోని ముఖ్యనాయకులు మాతృగూటికి చేరడానికి ఉరకలు తీస్తున్నారు. తమాకాను వీడి నేతలు కాంగ్రెస్ గూటికి వెళుతుండడంపై మంగళవారం మీడియా ఎదుట వాసన్ స్పందించారు. 99.9 శాతం మంది నాయకులు పార్టీ సమావేశంలో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి మద్దతు తెలియజేశారని, అయితే, ఇప్పుడేమో తిరుగు బాటు, అసంతృప్తి అంటూ నినాదాన్ని అందుకోవడం విచారకరంగా పేర్కొన్నారు.
ఎవరు బయటకు వెళ్లినా సరే, తన పార్టీకి ఢోకా లేదని, తన పార్టీని ఎలా నడిపించాలో తనకు తెలుసనని వ్యాఖ్యానించారు. ఇక, మరో విషయం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు చెబుతున్నానంటూ, తన మీద , తన పార్టీ వర్గాల మీద కరుణ చూపించే విధంగా మొసలి కన్నీళ్లు వద్దు అని, తన పార్టీ సత్తా ఏమిటో ఎన్నికల ఫలితాల ద్వారా రుజువు చేస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు విషయంగా తాను ఎలాంటి చర్చలు జరప లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కొందరు వెళ్లినంత మాత్రాన పార్టీ బలహీన పడదని, వారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా మరింత బలం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
వాసన్‌కు టాటా..
Published Wed, Apr 13 2016 8:29 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement
Advertisement