వీఐటీలో ఎగ్జిబిషన్ ప్రారంభం
వేలూరు, న్యూస్‌లైన్: వీఐటీ యూనివర్సిటీలో సౌత్ రాష్ట్రాలకు చెందిన మూడవ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ పరిశోధనలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుంచే పరిశోధనలు తయారు చేయడానికి సిద్ధం కావాలన్నారు. పాఠశాల స్థాయిలో పరిశోధ నలకు అవసరమైన అన్ని వసతులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్ జన్‌సన్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు సూట్‌కేసులోనే బుల్లెట్ తయారు చేసి ఈ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఈ పరిశోధన పలువురిని ఆకట్టుకుంది. అలాగే చెన్నై కీల్‌పాక్కంకు చెందిన పాఠశాల విద్యార్థులు బ్యాటరీతో నడిచే మినీవిమానం, రాణిపేట మహర్షి పాఠశాల విద్యార్థులు రైలు పట్టాలతో విద్యుత్ తయారు చేయడంపై ఎగ్జిబిషన్‌లో ఉంచారు.
ఐదు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు వివిధ పరిశోధనలు తయారు చేశారని వీటిని ప్రతినిధులచే పరిశీలించి వీటికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామని చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. ఆయనతోపాటు పరిశీలించిన వారు వీఐటీ వైస్ చాన్స్‌లర్ రాజు, ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, ప్రొఫెసర్ నారాయణన్, వీఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు