
మార్పులకు కసరత్తు
{పస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు?
యువ నేతలకు పెద్దపీట
బెంగళూరు అభివృద్ధి కోసం {పత్యేక మంత్రిత్వశాఖ
మాజీ సీఎం జేహెచ్ పటేల్ కాలం నాటి ప్రతిపాదనల అమలుకు చర్యలు
బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలిలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య కసరత్తు మొదలెట్టారు. దీని వల్ల రానున్న రెండున్నరేళ్లలో కొత్త పథకాల అమలుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది సిద్ధరామయ్య ఆలోచనగా తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచన, విస్తరణ ఖాయం కానున్న నేపథ్యంలో మంత్రి మండలి మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ మంత్రి మండలిలో నాలుగు శాఖలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మందికి ఈ ‘ఖాళీ’ మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితి పార్టీలో అసమ్మతిని రాజేస్తోంది. ఇక కేపీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ జీ. పరమేశ్వర్ పదవి కాలం వచ్చే అక్టోబర్ నాటికి ముగియనుంది. దీంతో ఆయన్ను కూడా మంత్రి మండలిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుత మంత్రి మండలిలో సమూల మార్పులు రానున్నాయి.
సీనియర్ మంత్రులపై వేటు
ఉద్యానశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారుల పై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కేజే జార్జ్ అసమర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీ కేసుకు సంబంధించి కూడా కేజే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్‌లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్‌లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చురుకుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది.
మెట్రోకు ప్రత్యేక మంత్రిత్వశాఖ
జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చి తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య పై అభివృద్ధి, పారిశ్రామిక వ్యతిరేక ముఖ్యమంత్రి అన్న ముద్ర ఉంది. దీన్ని తొలగించుకోవడం కోసమే అప్పట్లో ఆగిపోయిన ఈ ప్రతిపాదనను ఇప్పుడు సిద్ధరామయ్య తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి బదులు ఈ తాజా, నూతన మంత్రిత్వశాఖను అప్పగించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఇందుకు ఏఐసీసీ పెద్దలు కూడా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.