
కావేరిపై నిపుణుల కమిటీ !
కావేరి నదీ జలాల పంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు నిపుణుల కమిటీ.
► రాష్ట్ర న్యాయవాది నారిమన్‌తో చర్చించాకే తుది నిర్ణయం
► అఖిలపక్ష భేటీలో తీర్మానం
సాక్షి, బెంగళూరు: ‘కావేరి నదీ జలాల పంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలా, వద్దా అన్న విషయంలో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని రాష్ట్ర అఖిలపక్షం నిర్ణయించింది. కావేరి నదీ జలాల పంపకంపై తరచుగా తమిళనాడు, కర్ణాకట, కేరళ, పుదుచ్చేరీల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తుండడం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటకలు కావేరి విషయంలో ప్రతి ఏడాది కోర్టు లేదా కావేరి ట్రైబ్యునల్‌కు వెళ్లడంతో సమస్య జఠిలమవుతోంది.
వర్షాభావం ఏర్పడినప్పుడు కావేరి నదీజలాల పంపకాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో నదీజలాల పంపకానికి సంబంధించి నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను అడిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన అన్ని పార్టీలకు చెందిన నాయకులు విధానసౌధలో సమావేశమమయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభనష్టాల పై చర్చించారు.
వారంలోపు నారిమన్‌తో భేటీ
జులైలో సుప్రీం కోర్టులో కావేరి నదీజలాలల పంపకంపై తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులపై చర్చించారు. ఈ విషయంలో కావేరిపై కర్ణాటక తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్న నారిమన్ సలహా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భేటీ అనంతరం ఎం.బీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ... మరో వారంలోపు ఉన్నతాధికారులో చర్చించి, నారిమన్‌తో భేటీ అయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రికి మద్దతునిస్తామని సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. మండలిలో బీజేపీ పక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప, శాసనసభలో జేడీఎస్‌పక్షనేత కుమారస్వామి గైర్హాజరయ్యారు.