ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే రాజీనామాను ఆమోదించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ఖడ్సే రాజీనామా లేఖ అందిందని, ఆ లేఖను గవర్నర్కు పంపినట్లు తెలిపారు. అలాగే ఖడ్సేపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిమిత్తం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించినట్లు వెల్లడించారు. కాగా అక్రమ భూకేటాయింపులలో ఖడ్సే పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
దాంతోపాటు దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు చాలాసార్లు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించడం సైతం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. కాగా ముందు రాజీనామా చేసేందుకు నిరాకరించిన ఖడ్సే ...ఆ తర్వాత ఒత్తిళ్లు అధికం కావడంతో మెట్టు దిగాల్సి వచ్చింది. ఆయన ఈరోజు ఉదయం తన రాజీనామా లేఖను నారిమన్ పాయింట్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమర్పించారు.