జయలలిత బంధువునని చెప్పుకొని..
బెంగళూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి తాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బంధువునని చెప్పి మోసగించిన యువకుడిని న గర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు...చెన్నైకు చెందిన నిజంతన్ అలియాస్ నిజు జయరామ్ ఫేస్‌బుక్ ద్వారా బెంగళూరులోని ఇందిరానగర్‌కు చెందిన వీణా అనే మహిళతో నాలుగు నెలల క్రితం స్నేహం ఏర్పరుచుకున్నారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు దగ్గరి బందువునని మీకు చెన్నైలో ఏమైనా పనిఉంటే చేసిపెడతానని నమ్మించాడు. ఇద్దరూ తరుచుగా ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగా వీణా తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయారు. దీంతో వీణాను పరామర్శించడానికి ఈనెల 8న బెంగళూరుకు నిజు జయరామ్ వచ్చాడు. నగరంలోని యూబీ సిటీలో నిజు జయరామ్, వీణాలు కలుసుకుని కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న ఓ షోరూంకు వెళ్లి రూ.60 వేలు విలువ చేసే ఫోన్‌ను కొనుగోలు చేసి వీణాకు కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా తల్లిని కోల్పోయి కష్టాల్లో ఉన్న నీకు పనికి వస్తుందని రూ.4 లక్షల చెక్కును కూడా వీణాకు అందించారు.
అనంతరం తాను డెబిట్‌కార్డు మరిచిపోయివచ్చానని చెప్పి ఫోన్‌కు చెల్లించాల్సిన రూ.60 వేలును వీణా ద్వారా ఇప్పించాడు. అనంతరం సెల్‌ఫోన్ యాక్సిసరీస్‌ను తన ఫ్రెండ్ షాప్ నుంచి తీసుకువస్తానని చెప్పి సెల్‌ఫోన్ సహా అక్కడినుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా కూడా జయరామ్ తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి మరుసటిరోజు బ్యాంకుకు వెళ్లి చెక్కు ద్వారా డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించగా సదరు అకౌంట్‌లో డబ్బు లేదని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వీణా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్ అకౌంట్, ఫోన్ సంభాషణలను అనుసరించి నిజ జయరామ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు మీడియాకు సోమవారం తెలిపారు.