
పామును తరిమేందుకు పంటకు నిప్పు పెట్టాడు!
చెన్నై(అన్నానగర్):
అరటి తోటలో ఉన్న పామును తరమేందుకు ఓ రైతు తోటకు నిప్పు పెట్టిన సంఘటన తమిళనాడులోని కుళిత్తలై సమీపంలో జరిగింది. దీంతో ఒకటిన్నర ఎకరాల అరటి తోట అగ్నికి ఆహుతైంది. కుళిత్తలై సమీపంలోని మణత్తటైకు చెందిన నటరాజన్ (66) రైతు. ఇతను శుక్రవారం తమ్ముడి అరటి తోటలో మేకలను మేపుతున్నాడు. ఆ సమయంలో తోటలోకి పాము రావడంతో అరటి ఆకులకు నిప్పు అంటించి తరమాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో తోటలో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి వీలు కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు ఒకటిన్నర ఎకరాల అరటి తోట మంటల్లో కాలిపోయింది.