భవిష్యత్‌ ఎడారే! | farmers lose about-the-judgment-of-the-brijesh kumar-tribunal | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ ఎడారే!

Published Mon, Oct 24 2016 12:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

భవిష్యత్‌ ఎడారే! - Sakshi

భవిష్యత్‌ ఎడారే!

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌  తీర్పుతో తీవ్రంగా నష్టపోనున్న  రైతులు
ప్రాజెక్టుల భవితవ్యంపై నీలినీడలు
ప్రభుత్వ చేతగానితనమే కారణమంటున్న రైతు సంఘాలు
 
 
కృష్ణా మిగులు జలాలను (మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌) నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలని బ్రిజేష్‌కుమార్‌ తీర్పునివ్వడంతో జిల్లా రైతుల్లో ఆందోళన మొదలైంది. మిగులు జలాలపై ఉన్న పూర్తి హక్కుతో చేపట్టిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో  వీటి ద్వారా సుమారు 2,43,500 ఎకరాలు సాగులోకి రానున్నాయి. దీంతో పాటు సుమారు  5 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించే బృహత్తర ప్రాజెక్టులకు నీరు కరువయ్యే పరిస్థితి దాపురించింది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కృష్ణా నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని స్వయంగా బ్రిజేష్‌కుమార్‌ చెప్పడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
 
సాక్షి, చిత్తూరు:  కరువు జిల్లా అయిన చిత్తూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వాలు గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులు చేపట్టాయి.  కృష్ణా నదిలోని మిగులు జలాలపైనే ఆధారపడి ఈ ప్రాజెక్టులను చేపట్టారు. జిల్లాలో గాలేరు– నగరి ద్వారా దాదాపు 1.03 లక్షల ఎకరాలు, హంద్రీ–నీవా ద్వారా సుమారు 1.40 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి.  నీటి కేటాయింపుల్లో కూడా జిల్లాకు చెందిన ప్రాజెక్టుల్లో కేవలం తెలుగుగంగకు మాత్రమే 25 టీఎంసీలు కే టాయించారు. గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను అసలు పరిగణలోకి తీసుకోలేదు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీసుకున్న నిర్ణయం అమలైతే జిల్లా  రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. అంతేకాకుండా ఫ్లోరైడ్‌ నీరు తాగుతున్న పశ్చిమ మండలాలకు స్వచ్ఛమైన తాగు నీరు దూరమయ్యే అవకాశం ఉంది. 
 
ప్రభుత్వ వైఫల్యమే..
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. తమ మిత్ర పక్షమైన బీజేపీతో కనీసం ప్రజల ప్రయోజనాల కోసం కూడా గట్టిగా నిలదీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట కూడా  సరైన వాదనలు వినిపించడంలో విఫలమైనందునే ఇలాంటి పరిస్థితి దాపురించిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. సొంత జిల్లాకు కూడా సీఎం చంద్రబాబు న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. 
 
రూ.వేల కోట్లు వృథాయేనా?
ట్రిబ్యునల్‌ తీర్పుతో ఈ రెండు ప్రాజెక్టులపై పెట్టిన సుమారు రూ.7 వేల కోట్లు వృథా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుచూపు కొరవడటం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నం అయింది. బ్రిజేష్‌ కుమార్‌ తీర్పు రాకముందే ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే ఈ ప్రాజెక్టులకూ నీటి కేటాయింపులు జరిగేవి. అయితే చంద్రబాబు గతంలో  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు.  అనంతరం వైఎస్సార్‌ హయాంలో శరవేగంతో దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణం తరువాత ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. దీంతో  బ్రిజేష్‌ కమిటీ ఈ ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement