
బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి
పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్రిజేశ్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమన్నారు. ఈ తీర్పు వల్ల ప్రజలు నష్టపోతారని, ఇది నాయకుల స్వంత వ్యవహారం కాదన్నారు. ఈ తీర్పును అసెంబ్లీలో ప్రధాన అంశంగా తీసుకుని చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ తనకోసం చేయించుకున్న సర్వేలు స్వంతడబ్బా కొట్టుకోవడానికేనన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎగువ రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని పొంగులేటి సూచించారు.