
కొడుకు మంజు, తండ్రి హిరణ్ణయ్య (ఫైల్)
మండ్య: ఎన్నో రకాల ఆరోగ్య బీమా పథకాలను ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవి ప్రజలను చేరడం లేదనేందుకు ఇదో ఉదాహరణ. ప్రైవేటు ఆస్పత్రిలో తండ్రి వైద్యానికి లక్షలాది రూపాయల ఫీజులను సర్దుబాటు చేయలేక తనయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు ఇక లేడని తెలుసుకుని ఆ తండ్రి ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. గుండెలు పిండివేసే ఈ విషాద ఘటన గురువారం మండ్య జిల్లాలోని కేఆర్ పేటె తాలూకాలో చోటు చేసుకుంది.
వివరాలు... కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న తాలూకాలోని బూకనకెరె గ్రామానికి చెందిన రైతు హిరణ్ణయ్య (55)ను కుమారుడు మంజు (23) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు.
మొదటిరోజే రూ.3.50 లక్షలు
ఆసుపత్రిలో చేర్పించిన మొదటి రోజు నుంచి వైద్యం, మందులు తదితర వాటికి రూ.3.50 లక్షలు ఖర్చుపెట్టించారు. అయితే వైద్యం ఇంకా కొన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఉందని అందుకు మరో రూ.80 వేలు ఖర్చవుతుందని లేదంటే ఇంటికి తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో తండ్రికి వైద్యం చేయించలేక పోతున్నానని విరక్తి చెంది మంజు ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు వదిలాడు. కుమారుడి ఆత్మహత్య విషయం తెలియడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి హిరణ్ణయ్య కూడా తీవ్రంగా మథనపడి తుదిశ్వాస విడిచాడు. తండ్రీ కొడుకులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో హిరణ్ణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment