ముస్లిం కోటాపై కౌన్సిల్‌లో రగడ | Fight in the Council on the Muslim quota | Sakshi
Sakshi News home page

ముస్లిం కోటాపై కౌన్సిల్‌లో రగడ

Published Fri, Jul 24 2015 1:39 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

ముస్లిం కోటాపై కౌన్సిల్‌లో రగడ - Sakshi

ముస్లిం కోటాపై కౌన్సిల్‌లో రగడ

♦ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపక్షాలు
♦ కోటాపై సుప్రీంలో అఫిడపిట్ దాఖలు చేశామన్న ప్రభుత్వం
♦ 65 ఏళ్లుగా రిజర్వేషన్లు {పకటించలేదు: ఖడ్సే
♦ కేవలం తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
♦ మండలిలో రభస..అరగంటసేపు సభ వాయిదా
 
 ముంబై : ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ గురువారం శాసన మండలి సమావేశాలను అడ్డుకున్నాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో చైర్మన్ అరగంటసేపు సభను వాయిదా వేశారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముస్లి రిజర్వేషన్లపై ఓ నిర్ణయానికొస్తామని గత డిసెంబర్‌లో సీఎం ఫడ్నవీస్ చెప్పారని ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్సీపీ ఎమ్మెల్సీ అబ్దుల్ ఖాన్ దుర్రని గుర్తుచేశారు.

ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నాయని ఖాన్ వివరించారు. అనేక రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించాయని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లపై నిర్ణయాన్ని తెలుపుతూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వివిధ కమిటీల నివేదికలు కూడా అఫిడవిట్‌లో పొందుపరిచామన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నామని చెప్పారు. దీనిపై కోర్టు నిర్ణయానికి కట్టుబడిఉంటామని వెల్లడించారు.

 ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
 మరో ఎమ్మెల్సీ కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. ముస్లింలకు విద్యలో ఐదు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు. ఖడ్సే స్పందిస్తూ.. ఆర్డినెన్స్ కాలం ముగిసేలోపు అడ్మిషన్లు తీసుకున్న వారికి విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు అనుమతిచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎన్సీపీ నేత సునీల్ తట్కరే విమర్శించారు. ఖస్సే స్పందిస్తూ.. 65 ఏళ్లుగా ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించలేదని, కాని ప్రస్తుతం కేవలం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ రాంరాజ్ నింబాల్కర్ సభను అరగంటసేపు వాయిదా వేశారు.

 జోక్యం చేసుకోలేం: సుప్రీం
 గతేడాది జూన్ 25న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ముస్లింలకు ఉద్యోగాల, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం సర్వీసుల్లో ఐదు శాతం రిజర్వేషన్లకు అనుమతినిస్తూ.. ప్రభుత్వం పాఠశాలల్లో రిజర్వేషన్లపై 2014, నవంబర్ 14 లో బాంబే హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పింది. హైకోర్టు నిర్ణయాన్ని పాటించాలని ప్రభుత్వానికి తెలిపిం ది. ఈ ఏడాది జనవరి 5న ముస్లిం కోటాపై తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి 3వారాల సమయమిచ్చింది. ముస్లిం కోటా పై ఆర్డినెన్స్ సమయం గ తేడాది డిసెంబర్ 23తో ముగిసిపోయింది.  
 
 ముంబైలో పెరిగిన అడవుల విస్తీర్ణం
 ముంబైలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. డెహ్రాడూన్‌కు చెందిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2014లో ముంబై నగరంలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో, ముంబై శివారు ప్రాంతాల్లో 4,300 హెక్టార్లలో అడవులు విస్తరించాయని, 2000 సంవత్సరంలో నగరంలో 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మునుగంటివార్ చెప్పారు. దీన్ని బట్టి 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని తెలుస్తోందన్నారు.

బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం ప్రభుత్వ స్థలంలోని అడవులు నియంత్రిత అడవులని పేర్కొన్నారు. ముంబై, శివారు ప్రాంతాల్లో 4,000 హెక్టార్లు.. ముంబై, శివారు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలంలోని 1,774 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులను పరిమిత అడవులుగా ప్రభుత్వం ప్రకటించిందని సుధీర్ చెప్పారు. అభివృద్ధి ప్రణాళిక స్థలంలోని అడవుల ప్రదేశాన్ని బహిరంగ ప్రదేశంగా ప్రకటిస్తారా అని బీజేపీ సభ్యుడు అశిష్ షేలర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. హైకోర్టు సూచనమేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
 ‘తెల్గీ’పై అట్టుడికిన సభ
 నకిలీ స్టాంపుల కుంభకోణం విషయమై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీజేపీ, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కుంభకోణంపై పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఎన్సీపీ నేత జితేంద్ర అవ్హాడ్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటేకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అయితే దీనిపై గోటే స్పందిస్తూ.. కేసు విచారణకుగానూ ముంబై పోలీస్ కమిషనర్‌గా ఓ అధికారిని నియమించేందుకు ఎన్సీపీ నేత, అప్పటి హోం శాఖ మంత్రి భుజబల్‌కు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారంటూ తెల్గీ నార్కో పరీక్షలో వెల్లడైందన్నారు.

అసెంబ్లీ బయట విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. దీని కోసం ఓ కార్పొరేట్ వ్యక్తి డబ్బు చెల్లించాడన్నారు. కుంభకోణం విషయమై ఇద్దరు నేతలు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. తెల్గీ కుంభకోణం విషయమై అసెంబ్లీలో తీవ్ర రభస జరగడంతో సభ పదినిమిషాలపాటు వాయిదా పడింది. కుంభకోణం విషయంలోని ఆరోపణలను పరిశీలించి అనంతరం రికార్డుల నుంచి వాటిని తొలగిస్తామని స్పీకర్ నింబాల్కర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement