ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
ఎంపీ బాల్క సుమన్
బెల్లంపల్లి: ముస్లిం, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. గురువారం పట్టణంలోని గోల్‌బంగ్లాబస్తీ వద్ద రూ.12 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆనాది నుంచి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ముస్లీంలను వృద్ధిలోకి తేవడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించి తూర్పు ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బీడు భూములను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీకి వదిలేసిందన్నారు. ఆ కమిటీ సూచనల మేరకు జిల్లాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల పేర్లు వస్తున్నా తుది నిర్ణయం మాత్రం కమిటీయే తీసుకుంటుందన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయాలనే విషయాన్ని ఈపాటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడి నుంచి నిర్మాణం జరుగుతున్న మినీ ట్యాంక్‌బండ్(పోచమ్మ చెరువు)ను పరిశీలించారు. పనులు నాణ్యతగా, నిర్ధేశించిన గడువు లోగా పూర్తిచేయూలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత కొత్త బస్టాండ్ కల్వర్టు నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే అప్రోజ్ రోడ్డుకు ఎంపీ భూమి పూజ చేశారు.
అంతకుముందు బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కృష్ణ, ఇతర నాయకులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ ఏఈ రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మాజీ అధ్యక్షుడు పసుల సురేశ్ పాల్గొన్నారు.